Jagan Government Passed the GPS Bill: గ్యారంటీ పింఛను అంటూ ప్రభుత్వం ఒక చేత్తో గ్యారంటీ ఇస్తోంది.. మరో చేత్తో కోత పెట్టేస్తోంది. పైగా ఇప్పుడున్న సీపీఎస్‌తో పోలిస్తే జీపీఎస్‌తో నష్టమేనని ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగి పదవీ విరమణ చేసే నాటికి మూల వేతనంలో 50 శాతం పింఛనుగా వచ్చేలా గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా వాళ్ల జేబులోంచి తీసి ఇచ్చేదేమీ లేదు. ఉద్యోగులు ప్రతి నెలా ఇచ్చే వాటా సొమ్ము, ప్రభుత్వం జత చేసే వాటా సొమ్ముతో ఏర్పడ్డ నిధిని యాన్యుటీ స్కీంలో పెట్టుబడిగా పెడతారు.
ఆ స్కీం నుంచి ప్రతి నెలా వచ్చే మొత్తం ఆధారంగా పింఛను ఇస్తానని సర్కారు చెబుతోంది. అలా వచ్చే సొమ్ము 50 శాతానికి తక్కువైతే అది తామే భరిస్తామని అంటోంది. ఆ విధంగా నెలకు 10 వేల వరకు భరిస్తానని చెబుతోంది. ఉద్యోగులు దాచుకున్న నిధిలో ప్రస్తుతం 60 శాతం మొత్తం పదవీ విరమణ సమయంలో వెనక్కి తీసుకోవచ్చు. ఒకవేళ ఆ నిధి నుంచి ఉద్యోగులు ఆ విధంగా డబ్బులు తీసుకుంటే పింఛను మొత్తానికి గ్యారంటీ ఇవ్వబోమని ప్రభుత్వం తేల్చిచెప్పేసింది. ఆ మేరకు పింఛనులో కోత పెడతామని బిల్లులో పేర్కొంది. ఆ మాత్రం దానికి సీపీఎస్‌తో పోలిస్తే జీపీఎస్‌తో ప్రయోజనం ఏంటని ఉద్యోగులు నిలదీస్తున్నారు.
ఉద్యోగి పదవీ విరమణ చేసేనాటికి 60వేల మూలవేతనం ఉందనుకుంటే జీపీఎస్‌లో 30వేల పింఛను వస్తుంది. ఆ ఉద్యోగికి పింఛను నిధి దాదాపు 60 లక్షలు జమైందని అంచనా వేస్తే, ఆ నిధిలో నుంచి ఏ మొత్తమూ తీసుకోకూడదు. కొంత తీసుకుంటే గ్యారంటీ పింఛను తగ్గిపోతుంది. అదే సీపీఎస్ విధానంలో 60లక్షల నుంచి 60శాతం అంటే 36 లక్షలు వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన 24 లక్షలు పింఛను స్కీంలో పెట్టుబడి పెడతారు. 12శాతం వడ్డీ వచ్చిందనుకున్నా 24వేల రూపాయలు పింఛను వస్తుంది. జీపీఎస్‌లో అదనంగా వచ్చే 6 వేల కోసం ఉద్యోగి కోల్పోయేది 36 లక్షలు. ఒకవేళ యాన్యుటీ స్కీం నుంచి ప్రతినెలా వచ్చే మొత్తం గ్యారంటీ పింఛను కన్నా ఎక్కువ ఉంటే ఏంచేస్తారో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇది ఉద్యోగులకు ఇస్తారా, తీసేసుకుంటారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. తర్వాత ఇచ్చే నిబంధనల్లో ఆ వివరణ ఏమైనా ఉంటుందేమో చూడాలని ఉద్యోగులు అంటున్నారు.
ఉద్యోగులకు ఎలాంటి హక్కులూ కల్పించని ప్రభుత్వం తనకు మాత్రం పెద్ద హక్కే బిల్లులో ఇచ్చుకుంది. ఈ గ్యారంటీ పింఛను కోసం ప్రభుత్వం ప్రతి నెలా అదనంగా ఇచ్చే టాప్‌అప్ మొత్తం 10వేలు ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చట. దీని నియమ నిబంధనలు ఇంకా రాలేదు. ఉద్యోగి ప్రవర్తన ఆధారంగా ఈ గ్యారంటీ పింఛను ఎత్తేస్తారట. ప్రవర్తన అంటే ఏంటో ఇంకా స్పష్టం చేయలేదు. పదవీ విరమణ చేసిన తర్వాత వేరే ఏదైనా ఉద్యోగం చేసుకుంటే ఈ పింఛనులో ప్రభుత్వం అదనంగా భరించే టాప్‌అప్ గ్యారంటీ ఉండబోదట. ఇక ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ ఏముందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే పదవీ విరమణ చేసి పెద్దమొత్తంలో పింఛను పొందుతున్న అనుయాయులను ప్రత్యేకాధికారులుగా నియమించి పెద్దపెద్ద జీతాలిస్తున్న జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు ఈ నిబంధన పెట్టడమేంటన్న విమర్శలు వస్తున్నాయి. ఈ గ్యారంటీ పింఛను పూర్తిగా పొందాలంటే 33 ఏళ్ల సర్వీసు ఉండాలట. ఇదేం నిబంధన అని ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుత ఉద్యోగులు పాత పింఛను విధానంలో 28 ఏళ్ల సర్వీసు చేసినా ప్రభుత్వం ఐదేళ్లు అదనంగా సర్వీసు కలిపి పూర్తి పింఛను ఇస్తోంది. అలాంటిది కొత్త పింఛను స్కీంలో ఇచ్చేది తక్కువైనా స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే 20 ఏళ్ల సర్వీసు, అనారోగ్య కారణాలతో పదవీ విరమణ పొందితే పదేళ్ల కనీస సర్వీసు ఉండాలని నిబంధనలు పెట్టడమూ చర్చనీయాంశమవుతోంది.
ప్రభుత్వ ఉద్యోగి రాజీనామా చేసినా, ప్రభుత్వం సర్వీసు నుంచి తొలగించినా ఈ పథకం వర్తించదు. క్రమశిక్షణ అంశాలు పెండింగులో ఉంటే అవి తేలేవరకు స్కీం ప్రయోజనాలు అందవు. ఉద్యోగి మరణిస్తే అతని భార్య లేదా, ఆమె భర్తకు ఆ పింఛనులో 60 శాతం ఇస్తారు. దీనికీ అనేక నిబంధనలు వర్తిస్తాయి. పాత పింఛను విధానంలో ఆరు నెలలకోసారి ద్రవ్యోల్బణం ఆధారంగా కేంద్రం ప్రకటించే కరవుభత్యం మొత్తాన్ని డీఆర్ రూపంలో ఇస్తారు. జీపీఎస్‌లో దానిపై స్పష్టత లేదు. చట్టం ఆధారంగా రూపొందించే నిబంధనల్లో వివరణ ఇస్తామన్నారు. పాత పింఛను విధానంలో అయిదేళ్లకోసారి వచ్చే పీఆర్సీ ఆధారంగా మూల పింఛను పెరుగుతుంది. ఈ స్కీంలో అది ఉండదు.