Jada Shravan Kumar comments on CM Jagan: ఆర్ 5 జోన్లో ఇళ్ల పట్టాలివ్వటాన్ని అడ్డుకుంటామని.. జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులు త్యాగం చేసి ఇచ్చిన భూమిని.. వేరే వారికి ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం జగన్ అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్ 5 జోన్ అంశంలో అమరావతి రైతులకు నిరాశ మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేదలపై జగన్ ప్రేమ దృతరాష్ట కౌగిలిలాంటిదని అభివర్ణించారు . నిజంగానే పేదలపై ప్రభుత్వానికి ప్రేమ ఉందనుకుంటే పొరపాటని అన్నారు. 2014లో అమరావతి రాష్ట్ర రాజధాని అని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నపుడు.. మూడు పంటలు పండే భూములను రైతులు ఇచ్చారన్నారు.
గత ప్రభుత్వం సీఆర్డీఏ ఒక యాక్టును తయారు చేసి రైతులకు భరోసా ఇస్తూ ఒప్పందం ప్రకారం భూములు తీసుకుంది. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు సీఆర్డీఏ ఒప్పందాలను తుంగలో తొక్కుతూ రైతులను మోసం చేసిందన్నారు. భూములు ఇచ్చిన రైతులపై జగన్ ప్రభుత్వం లాఠీ జులిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు టీడీపీ పార్టీ పేరును అంటగట్టి.. కక్షసాధింపుగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సైనికుడు దేశానికి రక్షణగా ఉంటే.. రైతు ప్రజల ఆకలి తీర్చేమరో సైనికుడు రైతు అని అన్నారు. కొంత మంది పేటియం గాళ్ళు అమరావతి రైతులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇవ్వడం రైతులు చేసిన పాపమా..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ ,ఆయన అనుచరులను భూములివ్వండని అన్నారు. అమరావతిలో పేద వాడికి సెంటు స్థలం అంటూ.. దళితుల మధ్య చిచ్చుపెట్టేందుకు జగన్ ప్రభుత్వం పూనుకుందన్నారు. అమరావతి అభివృద్ధిలో భాగంగా నవ నగరాలు నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాజధానిలో 36 వేల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, ఫైనాన్స్ సిటీ, హెల్త్ సిటీ, టూరిజం సిటీ, లాంటివి నిర్మించాలని మాస్టర్ ప్లాన్ గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం నవ నగరాలు నిర్మిస్తే టీడీపీకి పేరొస్తుందని అక్కసుతో రాజధానిని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు.
అమరావతి రాజధానిలో ఏం అభివృద్ధి చేశావని సీఎం జగన్ను ప్రశ్నించారు. గత ప్రభుత్వం సెక్రటేరియట్లో జగన్ పాలన సాగించడం లేదా? గత ప్రభుత్వ రోడ్లపై నడవడం లేదా? అని నిలదీశారు. అసలు తల్లి, చెల్లి కూడా ముఖ్యమంత్రి జగన్ను నమ్మడం లేదన్నారు. రైతులు ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి... న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారన్నారు. రైతుల కోసం క్షేత్రస్థాయిలో పోరాటం చేసేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమరావతి ఉద్యమ పోరాటం కేవలం రైతులది మాత్రమే కాదు.. 5 కోట్ల ఆంధ్రులదని అన్నారు.
ఇవీ చదవండి: