కరోనా రెండో దశలో గుంటూరు జిల్లాలో రోజూ వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇందులో చాలా మందికి లక్షణాలు లేకపోవడం లేదా స్వల్పంగా మాత్రమే లక్షణాలు ఉంటున్న కారణంగా... వీరికి ఆసుపత్రి వైద్యం అవసరం లేదు. వైద్యుల సూచనలను పాటిస్తూ హోం ఐసోలేషన్‌లో ఉండొచ్చు. వేరే గది, బాత్రూం లేని ఇళ్లల్లో మాత్రం ఇది సాధ్యపడకపోవచ్చు. బాధితుల నుంచి కుటుంబసభ్యులకు వ్యాపించే ప్రమాదముంది. ఇలాంటి వారు కొవిడ్ కేర్ కేంద్రాలకు వెళ్లొచ్చు.
ఇలాంటి వారికి.. ఆర్టీపీసీఆర్ పరీక్ష నివేదిక ఆధారంగా వైద్య సిబ్బంది ఇంటికొచ్చి సమీక్షించాక కేంద్రానికి వెళ్లాలని సిఫారసు చేస్తారు. ఈ కేంద్రాల్లో వైద్యసిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బందీ ఉండదని వైద్యులంటున్నారు. గుంటూరు, చిలకలూరిపేట, తెనాలి, నరసరావుపేటలోని టిడ్కో ఇళ్లను కొవిడ్ కేర్ కేంద్రాలుగా మార్చారు. బాపట్ల, రేపల్లెలోనూ ఏర్పాటు చేశారు. అన్నీ కలుపుకొని 3 వేల 300 పడకలు అందుబాటులో ఉన్నాయి. గుంటూరు శివార్లలోని అడవితక్కెళ్లపాడులో చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా 100 పడకలు ఏర్పాటు చేశారు. త్వరలోనే వినుకొండ, తాడేపల్లితోపాటు..గుంటూరులో మరో కొవిడ్ కేర్ కేంద్రం ప్రారంభించనున్నారు.
ఇదీ చదవండి: