Attendance with plastic finger prints: గుంటూరు జిల్లా తెనాలి జిల్లా ఆసుపత్రిలో వైద్యుల వ్యవహారశైలితో రోగులకు సరైన సేవలు అందటం లేదన్న విమర్శలు ఉన్నాయి. వైద్యులు సమయపాలన పాటించరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయోమెట్రిక్ హాజరుతో అలాంటివాటికి అడ్డుకట్టపడింది అనుకుంటున్న సమయంలో.. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు.. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ కొందరు వైద్యులు సరికొత్త అక్రమానికి తెరలేపారు.
ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు వైద్యులు ప్లాస్టిక్ వేలిముద్రల సాయంతో హాజరు వేస్తున్నట్లు తేలింది. వారిద్దరూ ఉదయం సమయంలో మాత్రమే హాజరు వేసి మధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత ఆసుపత్రికి రావటం లేదు. ప్లాస్టిక్ వేలి ముద్రలు తయారు చేయించి.. సెక్యూరిటీ సిబ్బందితో హాజరు వేయిస్తున్నారు. గైనకాలజిస్టుగా పనిచేస్తున్న ఓ మహిళా వైద్యురాలు, ఈఎన్టీగా పనిచేస్తున్న ఆమె భర్త ఇద్దరూ కొద్దిరోజులుగా ఇలా చేస్తున్నట్లు తేలింది. వైద్యుల మధ్య తలెత్తిన విభేదాలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌభాగ్యం విచారణ చేపట్టి.. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా అక్రమ హాజరు నిజమేనని నిర్థరణకు వచ్చారు. ఆసుపత్రిలో వైద్యులకు, ఇతర సిబ్బందికి వేర్వేరుగా బయోమెట్రిక్ యంత్రాలున్నాయి. వైద్యులు ఉపయోగించే యంత్రం వద్ద భద్రతా సిబ్బంది వేలి ముద్రలు వేస్తున్నట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. సిబ్బందిని పిలిచి విచారించగా నిజం ఒప్పుకున్నారు. దీంతో సెక్యూరిటీ సూపర్‌వైజర్ ఫణి, గార్డు పుల్లయ్యను విధుల నుంచి తప్పించారు. వైద్యులకు నోటీసులు జారీ చేశారు. పొరుగు సేవల విధానంలో పనిచేసే సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బందిపై వేటు వేయటం కంటితుడుపు చర్య అని.. వైద్యులను రక్షించేందుకే ఇలా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే బాపట్ల జిల్లా గుంటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అక్కడ పనిచేస్తున్న వైద్యులు భాను ప్రకాష్ విధులకు రాకుండానే ఇలా ప్లాస్టిక్ వేలి ముద్రలతో అటెండెన్స్ వేసేవారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆకస్మికంగా ఆసుపత్రికి వెళ్లగా అక్కడ వైద్యుడు లేరు. అటెండెన్స్ మాత్రం వేసే ఉంది. సిబ్బందిని విచారిస్తే వాస్తవం తెలిసింది. వెంటనే భానుప్రకాష్‌ను సస్పెండ్ చేయటంతో పాటు మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ఇప్పుడు మళ్లీ ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో అదే తరహా వ్యవహారం వెలుగుచూసింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోనే అక్రమాలు జరుగుతున్నందున.. పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఇవీ చదవండి: