International Yoga Day Celebrations in AP: తొమ్మిదొవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో యోగాసనాలు వేశారు. దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకుంటే ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చని.. గవర్నర్ సహా ప్రజా ప్రతినిధులు, అధికారులు సందేశమిచ్చారు. రాజ్ భవన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన జీవనానికి యోగా ఎంతో అవసరమని ఆయన సూచించారు. అన్ని వయసుల వారికి శారీరక, మానసిక ఆరోగ్యప్రయోజనాలను యోగా అందిస్తుందని తెలిపారు.
విజయవాడలో ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా వేడుకల్లో ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పాల్గొన్నారు. యోగాను ఒక అలవాటుగా మార్చుకోవాలని కృష్ణబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ భాగ్యలక్ష్మి, కలెక్టర్ ఢిల్లీ రావు పాల్గొన్నారు. నిత్యం యోగా చేయటం వల్ల మధుమేహం లాంటి ధీర్ఘకాలిక సమస్యలు నియంత్రణలో ఉంటాయని.. రమేష్ హాస్పటల్స్ ఎండీ డా.రమేష్ బాబు సూచించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేటలో యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు.
శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆయూష్ విభాగంలో నిర్వహించిన యోగా వేడుకల్లో విద్యార్థులు, మహిళలు యోగాసనాలు వేశారు. విశాఖలోనూ స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం పాల్గొనగా.. జిల్లా అధికారులు యోగా సాధన చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్ ఈ వేడుకలో పాల్గొన్నారు. విశాఖ రైల్వే క్రీడా మైదానంలో రైల్వే ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఆసనాలు వేశారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో కంటైనర్ పోర్ట్ టెర్మినల్‌లో యోగా వేడుకలు నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, విద్యార్థులు ఆసనాలు వేశారు.
బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు యోగాసనాలు వేశారు. కర్నూలులో స్టేడియంలో ఎంపీ సంజీవ్‌కుమార్ పాల్గొన్నారు. సత్య సాయి జిల్లా లేపాక్షిలో నిర్వహించిన యోగా ఉత్సవాల్లో కేంద్ర సహాయమంత్రి దేవ్‌సిన్హ్ చౌహన్ పాల్గొన్నారు. అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ గౌతమి, యోగాసనాలు వేశారు.