Interest on Working Capital Tax in AP: విద్యుత్ వినియోగదారులపై మరో బాదుడుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. నిర్వహణ మూలధనంపై వడ్డీ పేరుతో అదనపు సొమ్ము వసూలు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. నిబంధనలు సవరించాలని ఏపీఈఆర్సీకి ప్రతిపాదించగా.. గత గురువారం ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. వసూళ్లకు అనుమతిస్తే ప్రజలపై 2 వేల కోట్ల భారం పడనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
నిర్వహణ మూలధనంపై వడ్డీ పేరుతో విద్యుత్ వినియోగదారుల నుంచి అదనపు సొమ్ము గుంజుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపితే.. గత నాలుగేళ్లలో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలుకు డిస్కంలు చేసిన ఖర్చుపై వడ్డీ లెక్కించి ఆ మొత్తాన్ని ప్రతి నెలా ఇచ్చే విద్యుత్ బిల్లుతో కలిపి వసూలు చేయనున్నారు.
ఈ విధంగా ప్రజలపై పడే భారం సుమారు 2 వేల కోట్లు ఉంటుందని నిపుణుల అంచనా. ఒక్క ఏపీఈపీడీసీఎల్ డిస్కం పరిధిలోని వినియోగదారులపైనే వర్కింగ్ క్యాపిటల్‌పై వడ్డీ రూపేణా 650 కోట్ల భారం పడే అవకాశం ఉంది. దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ, కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా వడ్డీ వసూలు ప్రతిపాదనలను ఏపీఈఆర్సీకి అందించాయి.
డిస్కంలు అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లకు కలిపి ప్రతి నెలా సుమారు 2వేల 700 కోట్ల రూపాయల విలువైన విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. అందులో సంక్షేమ పథకాలకు సరఫరా చేసిన దానికి సబ్సిడీ మొత్తం పోను.. ఇతర వినియోగదారుల్లో 95 శాతం మంది నుంచి బిల్లులు వసూలవుతున్నాయి. అంటే ప్రజల నుంచి రావాల్సిన బకాయిలు తక్కువే. అలాంటప్పుడు నిర్దేశిత వ్యవధిలో బిల్లులు చెల్లించిన తర్వాత కూడా వడ్డీ భారాన్ని వినియోగదారులపై మోపడమేంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
జగనన్న పాలనలో రాష్ట్రానికి కరెంట్ కష్టాలు
వివిధ సంక్షేమ పథకాలకు సరఫరా చేసే విద్యుత్‌కు ఇచ్చిన రాయితీలను ప్రభుత్వం నిర్దేశిత వ్యవధిలో చెల్లించడం లేదు. వ్యవసాయం, ఆక్వా, ఎస్సీ, ఎస్టీ కాలనీలు, ఇతర వినియోగదారులకు ఈ ఏడాది జూన్ వరకు సరఫరా చేసిన విద్యుత్‌కు 11వేల 874 కోట్లు సబ్సిడీల కింద డిస్కంలకు రావాల్సి ఉంది. వివిధ ప్రభుత్వ విభాగాలు వినియోగించిన విద్యుత్‌కు 12వేల 256 కోట్ల బకాయిలు చెల్లించాలి. మొత్తం 24వేల 130 కోట్లకు ప్రభుత్వం బకాయి పడింది.
ప్రభుత్వ బకాయి పడిన మొత్తాన్ని విడుదల చేస్తే విద్యుత్ కొనుగోలుకు డిస్కంలు అప్పులు తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. అలా జరగకపోవడంతో డిస్కంలకు వర్కింగ్ క్యాపిటల్ సరిపోక రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే విద్యుత్ వినియోగదారుల నుంచి ప్రతి నెలా చెల్లించాల్సిన బిల్లుకు కనీసం 2 రెట్లు డిపాజిట్ కింద డిస్కంలు వసూలు చేస్తున్నాయి. మళ్లీ అదనపు భారం వేసేలా డిస్కంలు ప్రతిపాదించడం నిబంధనలకు విరుద్ధమని నిపుణులు అంటున్నారు.
2006లో టారిఫ్ నిబంధనలు అమల్లోకి వచ్చే నాటికి స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లు అనే పద్ధతే లేదని డిస్కంలు అంటున్నాయి. అప్పటికి విద్యుత్ ఎక్స్ఛేంజి కూడా లేదు. జెన్‌కోల నుంచి తీసుకున్న విద్యుత్‌కు బిల్లులు చెల్లించడానికి 60 రోజుల వ్యవధి ఉండేది. కానీ స్వల్పకాలిక విద్యుత్ ఒప్పందం ద్వారా ఎక్స్ఛేంజిలో విద్యుత్ కొనాలంటే ముందుగా డబ్బు చెల్లించాలి. దీనికి వర్కింగ్ క్యాపిటల్ అవసరం పడుతోందని.. అందుకే అప్పులు చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు.