Amaravati plots Inspection: రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అతి త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాల పంపిణి జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్ల పరిశీలనకు పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం మంగళవారం రాజధానిలో పర్యటించారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్తో కలిసి వారు మంగళగిరి మండలంలోని నవులూరు, కృష్ణాయపాలెంలో లేఔట్లను పరిశీలించారు.
అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్లాట్ల పంపిణీకి ఏమైనా ఆటంకాలున్నాయా అనే విషయాలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అమరావతిలో ఇళ్ల స్థలాలను .. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని పేదలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అయితే మంత్రులు, అధికారులు లేఔట్ల పరిశీలనకు వెళ్లే సమయంలో కృష్ణాయపాలెంలో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఆర్ 5 జోన్ రద్దు చేయాలంటూ కృష్ణాయపాలెంలో రైతులు రిలే దీక్షలు చేస్తున్నారు. దీనిలో భాగంగా మంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఆర్ 5 జోన్ రద్దు చేయాలంటూ కేకలు వేశారు. రైతుల నుంచి నిరసన ఉంటుందని గ్రహించిన పోలీసులు ముందుగానే భారీ సంఖ్యలో మోహరించారు. రైతులను రోడ్డుపైకి వెళ్లకుండా వారు నిలువరించారు. ఆర్ 5 జోన్ అంశంపై రైతులు వేసిన పిటిషన్ ప్రస్తుతం సుప్రింకోర్టులో ఉంది. ఈ వారంలో సుప్రీం ధర్మాసనం వద్ద విచారణ జరిగే అవకాశముంది. ఈలోగానే రాజధానిలో పేదలకు ప్లాట్ల పంపిణికి ప్రభుత్వం ముందుకెళ్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై రాజధాని దళిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"రాజధాని అమరావతిలో సెంటు భూములు చొప్పున.. సీఎం జగన్మోహన్ రెడ్డి తాత సొమ్మేదో.. ఇస్తున్నట్లు ఇక్కడికి వచ్చి ఉద్యమాలు చేస్తున్న మా రైతుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేయడమనేది చాలా దుశ్చర్య. అమరావతిపై విషం చిమ్మిన ప్రతి ఒక్కరూ మూటా ముల్లె సర్దుకుని ఇంటికి పోయారు. జగన్కు వత్తాసు పలికే నీలాంటి దళిత ద్రోహులందరికీ రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడుతామని హెచ్చరిస్తున్నాము." - చిలకా బసవయ్య, రైతు
ఇవీ చదవండి: