రోజురోజుకు పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడులు... తగ్గిపోతున్న దిగుబడులు... రైతులను ఆందోళనకు గురి చేయటమే కాదు... అన్నదాతల్ని సాగుకి దూరం చేస్తోంది. విత్తనాల నుంచి ఎరువులు, పురుగుమందుల వరకూ రైతులు ప్రైవేటు కంపెనీలపై ఆధారపడటం పెట్టుబడులు పెరిగేందుకు ప్రధాన కారణం. ఈ పరిస్థితుల్లో దేశీయ వంగడాలు వినియోగంలోకి తెచ్చేందుకు గుంటూరు జిల్లా కొల్లిపొర మండలం అత్తోట గ్రామస్తులు ముందుకొచ్చారు.
అడుగు పడిందిలా...
200 రకాల దేశీవాలి వరి వంగడాల్ని ఇటీవలే ప్రదర్శించారు. హైబ్రిడ్ రకాలు రాకమునుపు ఉన్న వంగడాలతో వ్యవసాయం చేసేలా ప్రోత్సహించారు. అవసరం ఉన్నవారికి విత్తనాలు అందజేశారు. రైతులంతా ఓ సమూహంలా ఏర్పడి ఐదెకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో దేశీవాలి విత్తనాలు సాగు చేస్తున్నారు. విత్తన కంపెనీలపై ఆధారపడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని కోసం స్వదేశీ బీజ్ మంచ్ సంస్థ సహకారం తీసుకున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్దేశకునిగా ఉన్న బాపారావు.
రైతుకు బలం... తిన్నోళ్లకు ఆరోగ్యకరం...
ఇప్పటికే అత్తోట గ్రామంలో కొందరు రైతులు దేశీవాళి విత్తనాలతో వ్యవసాయం చేశారు. వారు తమ అనుభవాల్ని తోటి రైతులతో పంచుకున్నారు.
మూలాల్లోకి వెళ్లడం మంచిదే
ఇలా వివిధ రకాల నాటు విత్తనాల్ని అందుబాటులోకి తీసుకురావటం మంచి పరిణామమంటున్నారు రైతు సాధికార సంస్థ ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్. కొన్ని రకాల ప్రకృతి విపత్తులు తట్టుకునే శక్తి పాత తరం విత్తనాల్లో ఉంటుందని వివరించారు. దేశీయ విత్తనాలను ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం చేయటం ద్వారా పెట్టుబడులు బాగా తగ్గుతాయని విజయ్ కుమార్ చెప్పారు. అలాగే ఈ విధానంలో ఆరోగ్యకరమైన ఆహారం పండించవచ్చని వివరించారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఈ సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారని వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి హాజరైన రైతు సంఘాల నేతలు ఇలాంటి కార్యక్రమానికి ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమన్నారు.
ఆదర్శ సాగు
గత మూడేళ్లుగా ఓ ఐదెకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ వస్తున్నారు. తద్వారా నేల బాగా గుల్లబారింది. ఇక్కడ నాటురకం వరి వంగడాల్ని సాగు చేసి అభివృద్ధి చేస్తున్నారు. తద్వారా వచ్చే సీజన్‌కు ఎక్కువ మొత్తంలో నాటు విత్తనాలు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇదీ చూడండి :పట్టణాల్లోనూ వార్డు సచివాలయాలు రానున్నాయి!