రైతు బజార్లకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడుతున్నారు. ఉల్లిపాయలు నిన్నటివరకు ప్రజల్ని భయపెడితే... మిగతా కూరగాయలు సైతం అదే బాట పట్టాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రేట్లు పెరిగాయి.
కూరగాయలు | ధరలు |
పెద్దచిక్కుడు | 76 |
కాకరకాయలు | 55 |
క్యాప్సికం | 50 |
దొండకాయలు | 43 |
బీరకాయలు | 46 |
వంకాయలు | 40 |
బీట్ రూట్ | 45 |
క్యారెట్ | 60 |
ప్రెంచి బీన్సు | 50 |
టమాటో | 32 |
తోటకూర, చుక్కకూర, పాలకూర, బచ్చలకూర, పుదీనా ఒక్కో కట్ట 15 రూపాయలు కాగా... కొత్తిమీరకు మరింత గిరాకీ పెరిగి ఏకంగా 30 రూపాయలకు చేరింది.పెరిగే ధరలతో సతమతమవుతూ చేసేదేమీలేక వినియోగదారులు నిట్టూరుస్తున్నారు.
కారణాలు ఇవే..
అధిక వర్షాల వల్ల పంటలు దిగుబడి తగ్గడమే కాకుండా కొన్నిచోట్ల దెబ్బతిన్న పరిస్థితి ఎదురవ్వడమే అధిక ధరలకు కారణమని రైతులు అంటున్నారు. కొన్ని కూరగాయలను దూరప్రాంతాల నుంచే తెచ్చే క్రమంలో కుళ్లి నష్టపోతున్నామని విక్రయదారులు చెబుతున్నారు, ఏటా కార్తిక మాసంలో ధరల పెరుగుదల సాధారణమేనని... ఈసారి వర్షాలు తోడుకావటంతో కూరగాయల ధరలు మరింత పెరిగాయని వారు అంటున్నారు.
రైతు బజారులో కూరగాయలు తక్కువ ధరకు వస్తాయని 40, 50 రూపాయలు బస్సు ఛార్జీలు పెట్టుకుని వస్తే ప్రయోజనం లేకుండా పోతోందని కొనుగోలు దారులు వాపోతున్నారు. వారానికి సరిపడా కూరగాయలు, పప్పులు కొనేందుకు రైతు బజారుకు వస్తున్న కొనుగోలుదారులు ధరల మోత తట్టుకోలేక.. సగం సంచి కూడా నిండకుండానే జేబు ఖాళీ చేసుకుని వెనుదిరుగుతున్నారు. త్వరగా ధరలు దిగివస్తే బాగుంటుందని అంటున్నారు.
ఇదీ చూడండి