రాజధాని రైతుల ఉద్యమం 600 రోజులకు చేరిన సందర్భంగా అమరావతి ఐకాస రేపు చేపట్టిన ర్యాలీకి అనుమతి లేదని గుంటూరు రేంజ్ ఐజీ త్రివిక్రమవర్మ తెలిపారు. కొవిడ్ దృష్ట్యా ర్యాలీకి అనుమతి సాధ్యం కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం అమల్లో ఉన్నందున 50 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. రెండు వర్గాలు ప్రదర్శనలు నిర్వహిస్తే శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందన్నారు. గొడవలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చినట్లు చెప్పారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ అనుమతి సాధ్యం కాదన్నారు. ఎవరికి వారు తమ శిబిరాల్లో నిరసన కార్యక్రమాలు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్ఛరించారు.
గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ... అమరావతి ఐకాస వారు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ ర్యాలీ కోసం అనుమతి అడిగినట్లు చెప్పారు. అయితే కోవిడ్ దృష్ట్యా బహిరంగ ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదన్నారు. పైగా హైకోర్టు వంటి కీలక ప్రాంతాల నుంచి ర్యాలీ ప్రారంభించాలనుకోవటం సరికాదని వ్యాఖ్యానించారు. బహుజన పరిరక్షణ సమితి కూడా ర్యాలీ చేపట్టి... రెండు వర్గాలు ఎదురైతే ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందన్నారు. రాజధాని ప్రాంతంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అరీఫ్ హఫీజ్ మాట్లాడుతూ... న్యాయస్థాన నుంచి దేవస్థానం, దేవస్థానం నుంచి న్యాయస్థానం కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ ర్యాలీలు చేపట్టవద్దని విజ్ఞప్తి చేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చి ఎవరైనా ఆందోళన చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: