పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం సుబ్బువారి పాలేనికి చెందిన వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి తిరుమల వెళ్లారు. ఆదివారం స్వామి దర్శనం అయింది. అదే రోజు రాత్రి 11 మంది ఫార్చునర్ కారులో తిరుగుపయనమయ్యారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు రాగానే ఒక్కసారిగా కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే... నష్టం జరిగిపోయింది.
ప్రమాదంలో వెంకటేశ్వరరావుతోపాటు ఆయన భార్య సూర్య భవాని, కుమార్తె సోనాక్షి, కుమారుడు గీతేశ్వర్, సోదరుడు ఆనంద్ కుమార్ మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన సాయి కిరణ్, సాయి దుర్గ తులసి, దివ్య శైలజ, అనంత లక్ష్మి, తేజేశ్వర్ తో పాటు డ్రైవర్ మణికంఠను ముందుగా చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సీనియర్ వైద్యులు ఎవరూ లేరు. గాయపడ్డ వారికి ఆసుపత్రి సిబ్బంది బ్యాండేజి వేసి సెలైన్ ఎక్కించటం మినహా వైద్యం చేయలేదు. తెల్లవారుజామున 5.30 గంటలకు ఆసుపత్రికి వచ్చినా... ఉదయం 7.30 వరకూ సరైన వైద్యం అందలేదు. అక్కడే ఉంటే సరైన వైద్యం అందదని భావించిన కుటుంబ సభ్యులు వారిని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న సాయికిరణ్ పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదంలో వాహనానికి ఎడమవైపు కూర్చున్న వారంతా మరణించారు. కుడివైపున ఉన్నవారు మాత్రమే గాయాలతో బయటపడ్డారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆ తర్వాత నర్సరావు పేట డీఎస్పీ రామవర్మ వచ్చారు. డ్రైవర్ అతివేగం, డ్రైవర్ కునుకుపాటు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన మణి అతని కుటుంబ సభ్యులు సత్వరం స్పందించారు. వెంటనే పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు.