High Court Status Quo : ఉపాధి హామీ పథకం కింద వివిధ జిల్లాల్లో సాంకేతిక సహాయకులుగా పని చేస్తున్న పలువురికి హైకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతం పని చేస్తున్న జిల్లా నుంచి వారిని మరో జిల్లాకు బదిలీ చేసిన వ్యవహారంలో యథాతథ స్థితి పాటించాలని అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు జడ్జ్ జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. బదిలీలకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ప్రతివాదులను ఆదేశించారు.
తమను ఏకపక్షంగా మరో జిల్లాకు బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ.. అనంతపురం జిల్లాకు చెందిన సాంకేతిక సహాయకుడు పి.పురుషోత్తం నాయుడు, కడప జిల్లాకు ధనిరెడ్డి యెరికలరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఎస్.సంతోష్ నాయక్, కర్నూలు, ప్రకాశం మరికొన్ని జిల్లాలకు చెందిన సాంకేతిక సహాయకులు హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, ఎన్వీ సుమంత్, తదితరులు వాదనలు వినిపించారు.
పిటిషనర్ల నియామక సమయంలో జిల్లాను ఒక యూనిట్‌గా పేర్కొన్నారన్నారు. జిల్లా యూనిట్ స్థానంలో రాష్ట్రాన్ని యూనిట్‌గా పేర్కొంటూ అధికారులు ఏకపక్షంగా నిర్ణయించారన్నారు. ఆ ఉత్తర్వులను కారణం చూపుతూ మరో జిల్లాకు బదిలీ చేస్తున్నారని వాదనలు వినిపించారు. స్వల్ప జీతాలతో మరో జిల్లాలకు వెళ్లి పని చేయాలంటే ఇబ్బంది ఉంటుందని న్యాయస్థానానికి విన్నవించారు. బదిలీ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. బదిలీలపై యథాతథ స్థితి పాటించాలంటూ ఆదేశాలిచ్చారు.
లోకాయుక్తలో విచారణ.. ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు: లోకాయుక్తలో జరుగుతున్న విచారణను నిలుపుదల చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లి ఎయిడెడ్ కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్(విజయ మిల్క్ డెయిరీ-నంద్యాల) ఎండీ జి.ప్రదీప్‌కుమార్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 13న విచారణ జరిపిన న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వం, లోకాయుక్త రిజిస్ట్రార్, కర్నూలు జిల్లా కలెక్టర్ తదితరులకు నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మే 11కు విచారణను వాయిదా వేసింది. హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. సహకార సంఘంలో నిబంధనల ఉల్లంఘన జరిగాయని పేర్కొంటూ హనుమంతరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిరాదు ఆధారంగా లోకాయుక్త విచారణ చేయడాన్ని సవాలు చేస్తూ విజయ మిల్క్ డెయరీ ఎండీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ సహకార సంఘం చట్టానికి సవరణ చేసి సహకార సంఘాల ఛైర్మన్, అధ్యక్షుడు, డైరెక్టర్లను లోకాయుక్త చట్ట పరిధిలోకి తీసుకురావడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు.
ఇవీ చదవండి: