Family Member Certificate: కుటుంబ సభ్యుల ధ్రువపత్రం జారీ విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ధ్రువపత్రం జారీ చేసే వ్యవహారంలో కుటుంబ సభ్యుల నుంచి స్వీకరించే రాతపూర్వక అభ్యంతరాలు.. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ కుటుంబ సభ్యులా? కాదా? అనే వ్యవహారం వరకే పరిమితం కావాలని తేల్చిచెప్పింది. అంతేకాని.. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాలు, ఇతర అంశాల్లోకి వెళ్లడానికి వీల్లేదంది. ధువపత్రం జారీకీ ఇబ్బందులు కలిగిస్తున్న జీవో 145ను సవరించాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యుడా? కాదా? అనే అంశం వరకే కుటుంబ సభ్యులిచ్చే రాతపూర్వక అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలంది. జీవో 145కి సవరణ చేశాక.. తహశీల్దార్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ముఖ్య కార్యదర్శికి స్పష్టంచేసింది. బాధితులకు చట్టబద్ధంగా దఖలు పడిన హక్కులను అడ్డుకునేందుకు కొంత మంది కుటుంబ సభ్యులు ‘రాతపూర్వక అభ్యంతరాలు’ సమర్పిస్తూ.. జీవోలని నిబంధనను దుర్వినియోగం చేస్తున్నారని ఆక్షేపించింది. బాధితులు ధ్రువపత్రం పొందకుండా కుటుంబ సభ్యులు చేసే దుష్ట ఆలోచనలలో అధికారులు భాగస్వాములు కావడానికి వీల్లేదంది. ఓ బాధిత మహిళకు కుటుంబ ధ్రువీకరణ పత్రం జారీచేయాలని అధికారులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల ఈమేరకు కీలక తీర్పు ఇచ్చారు.
విశాఖ జిల్లాకు చెందిన బంగారురాజు, జ్యోతికి 2019 డిసెంబర్ 6న వివాహం అయ్యింది. కొవిడ్ కారణంతో పెళ్లైన ఏడాదిన్నర గడవక ముందు 2021 మే 21న కన్నుమూశారు. భర్తను కోల్పోయిన యువతి కారుణ్య నియామకం కింద తన అర్హతను బట్టి ఉద్యోగం కల్పించాలని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తికి దరఖాస్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ధ్రువపత్రం సమర్పించాలని కోర్టు సిబ్బంది కోరారు. దీంతో ధ్రువపత్రం కోసం తహశీల్దార్‌ను ఆశ్రయించారు. మృతుడి తల్లి, జ్యోతి అత్త.. అభ్యంతరం తెలిపారనే కారణం చూపుతూ మాకవరపాలెం తహశీల్దార్ ధ్రువపత్రం ఇచ్చేందుకు నిరాకరించారు. నర్సీపట్నం జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించినప్పటికీ వివాదం పరిష్కారం కాకపోవడంతో యువతి.. హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇలాంటి వివాదాలు తరచూ తలెత్తడం, కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంలో కోర్టుకు సహాయకులుగా సీనియర్ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డిని అమికస్‌క్యూరీగా నియమించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది టీవీ శ్రీదేవి వాదనలు వినిపిస్తూ..‘కుటుంబ సభ్యులు నిరభ్యంతర పత్రం ఇస్తేనే దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి ధ్రువపత్రం ఇవ్వాలని 2015 ఏప్రిల్ 25న రెవెన్యూశాఖ జీవో 145ను జారీచేసింది. ఆ జీవోలోని నిబంధనను కారణంగా చూపుతూ పిటిషనర్ అత్త.. ధ్రువపత్రం ఇచ్చేందుకు చట్ట వ్యతిరేక ఆక్షలు పెట్టారు. తన కుమారుడు చనిపోయినందుకు వచ్చే పరిహారంలో 75% సొమ్మును వదులుకోవాలని, అంతేకాక ఇంటితోపాటు ఎకరం పొలంపై హక్కులను త్వజించుకుంటేనే కుటుంబ సభ్యుల ధ్రుపవత్రం ఇవ్వాలని షరతుపెడుతూ రెవెన్యూ అధికారులకు రాతపూర్వక అభ్యంతరం తెలిపారు. ఆ కారణాన్ని చూపుతూ తహశీల్దార్ ధ్రువపత్రం ఇవ్వడం లేదు. అత్త చట్టవిరుద్ధమైన ఆంక్షలు విధిస్తున్నారు. ఆ జీవోను సవరించాలని’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. భర్తను కోల్పోయి దుఖంలో ఉన్న యువతిని ఇబ్బందులకు గురిచేసేలా అసంబద్ధ షరతులతో కుటుంబ సభ్యుల ధ్రువపత్రం పొందకుండా అత్త అడ్డంకులు సృష్టించారని తప్పుపట్టారు. పిటిషనర్ జీవనాధార హక్కు పొందేందుకు వీల్లేకుండా చేశారన్నారు. ధ్రువపత్రం కోసం కోర్టును ఆశ్రయించే పరిస్థితి కల్పించారన్నారు. ఆ చర్య చట్టవిరుద్ధమైనదిగా తేల్చారు. పిటిషనర్ అత్త ఏవిధమైన అభ్యంతరం లేవనెత్తారు అనే విషయాన్ని తహశీల్దార్ తార్కికంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందన్నారు. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యుడా? కాదా? అనే వ్యవహారంపైనే కుటుంబ సభ్యులు రాతపూర్వక అభ్యంతరాలను చెప్పుకునేందుకు జీవోలో నిబంధనను పెట్టారన్నారు. ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించాలి, అందులో ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనే వ్యవహారంపై జీవోలో మరింత స్పష్టత అవసరం అన్నారు. ధ్రువపత్రం జారీ విషయంలో ఇలాంటి ఘటనలే మళ్లీ పునరావృతం కాకుండా జీవోలో స్పష్టత ఇస్తూ సవరణ చేసి దిగువ స్థాయి సిబ్బందికి తెలపాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించారు.
ఇవీ చదవండి