High Court judgement on vehicle taxes: వాహనాలపై జీవిత కాలపు పన్నును(లైఫ్ ట్యాక్స్).. పన్నులన్నింటితో కలిపిన ఎక్స్ షోరూం ధర ఆధారంగా విధించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. నికర ఇన్వాయిస్ ధర ఆధారంగా మాత్రమే పన్ను విధించాలని తేల్చిచెప్పింది. వాహన ధర ఆధారంగా మాత్రమే జీవితకాలపు పన్ను విధించాలని.. ఏపీ మోటారు వాహనాల పన్నుల చట్టంలోని ఆరో షెడ్యూల్‌లో స్పష్టం చేస్తోందని తెలిపింది. రెండు కార్ల యజమానుల నుంచి జీవితకాల పన్ను కింద అదనంగా వసూలు చేసిన సొమ్మును నాలుగు వారాల్లో తిరిగి చెల్లించాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఉమ్మడి కృష్ణా జిల్లా రవాణా అధికారి, విజయవాడ ప్రాంతీయ రవాణా అధికారిని ఆదేశించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత ఇటీవల ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎంఆర్‌కే చక్రవర్తి వాదనలతో ఏకీభవించారు.
- 2019.. తాను కొనుగోలు చేసిన హ్యుందాయ్ వెన్యూ కారుకు నికర ఇన్వాయిస్ ధరపై నిబంధనలకు విరుద్ధంగా 14శాతం పన్ను విధించి.. అదనంగా 52 వేల 168 రూపాయలు వసూలు చేశారని పేర్కొంటూ.. విజయవాడకు చెందిన తలశిల సౌజన్య 2019లో హైకోర్టును ఆశ్రయించారు. అదనంగా వసూలు చేసిన సొమ్మును రవాణాశాఖ అధికారుల నుంచి వెనక్కి ఇప్పించాలని కోరారు.
- 2021.. బీఎండబ్ల్యూ కారు కొనుగోలు వ్యవహారంలో నెట్ ఇన్వాయిస్ ధర ప్రకారం కాకుండా.. ఎక్స్ షో రూం ధర ఆధారంగా జీవిత కాలపు పన్ను విధించడాన్ని సవాలు చేస్తూ విజయవాడకు చెందిన వల్లూరు పవన్ చంద్ 2021లో హైకోర్టును ఆశ్రయించారు. తన నుంచి అదనంగా వసూలు చేసిన లక్ష 16 వేలను వెనక్కి ఇప్పించాలని కోరారు. ఈ రెండు వ్యాజ్యాలపై హైకోర్టు ఇటీవల తుది విచారణ జరిపింది.
ALSO READ: ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌పై హైకోర్టు ఆగ్రహం.. వారెంట్ జారీ
పిటిషనర్ తరఫున న్యాయవాది ఎంఆర్‌కే చక్రవర్తి వాదనలు వినిపించారు. కొనుగోలుదారుడు డీలర్‌కు చెల్లించే సొమ్ము మాత్రమే వాహన ధర అవుతుందన్నారు. అన్ని పన్నులతో కలిపి ఎక్స్ షోరూం ధర వాహన ధర అవ్వదన్నారు. 2018లో ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇస్తూ.. కొనుగోలుదారుడు డీలర్‌కు చెల్లించే సొమ్మును మాత్రమే వాహన ధరగా పరిగణించాలని పేర్కొందని తెలిపారు. అంతేతప్ప ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని పన్నులతో కలిపి నిర్ణయించే ఎక్స్ షో రూం ధర కాదని స్పష్టం చేసిందన్నారు.
హ్యుందాయ్ వెన్యూ ఇన్వాయిస్ ధర 8 లక్షల 60 వేల 853 రూపాయలుగా పేర్కొన్నారన్నారు. రూ 10 లక్షల కన్నా తక్కువ విలువ ఉన్న వాహనాలకు 12% మాత్రమే జీవితకాలపు పన్నును విధించాల్సి ఉంటుందన్నారు. అన్ని పన్నులను కలుపుకొని ఎక్స్ షోరూం ధర 11 లక్షల 10వేల 500లుగా పేర్కొంటూ.. వాహన ధర రూ 10లక్షలు మించిందనే కారణంతో 14% చొప్పున పన్ను మదింపు చేసి రూ లక్షా 55 వేల 470 రూపాయలను రిజిస్ట్రేషన్ సమయంలో రవాణాశాఖ అధికారులు వసూలు చేశారన్నారు.
వల్లూరు పవన్‌చంద్ కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారు విషయంలోనూ రూ 1 లక్ష 16 వేలను పన్ను రూపంలో అదనంగా వసూలు చేశారన్నారు. ఆ సొమ్మును వెనక్కి ఇప్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. నికర ఇన్వాయిస్ ఆధారంగా జీవితకాలపు పన్ను విధించాలి తప్ప.. ఎక్స్ షోరూం ధర ఆధారంగా కాదని తేల్చిచెప్పారు. జీవితకాలపు పన్నును కేవలం వాహన ధర ఆధారంగా విధించాలని ఏపీ మోటారు వాహనాల పన్నుల చట్టంలోని ఆరో షెడ్యూల్ స్పష్టం చేస్తోందని తెలిపారు. పిటిషనర్ల వద్ద నుంచి అదనంగా వసూలు చేసిన సొమ్మును నాలుగు వారాల్లో తిరిగి చెల్లించాలని రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, ఉమ్మడి కృష్ణా జిల్లా రవాణా అధికారి, విజయవాడ ప్రాంతీయ రవాణా అధికారిని ఆదేశించారు.