High Court on inter practicals: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ ను హైకోర్టు నిలిపేసింది. 'నాన్ జంబ్లింగ్' విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు గతేడాది నవంబర్ 15న ఇంటర్ బోర్డ్ ఉత్తర్వులు జారీచేసింది. పరీక్షలు సమీపించిన వారం రోజుల ముందు అంటే ఈనెల 3 న జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామంటూ ఉత్తర్వులిచ్చింది. దీన్ని అప్లియేటెడ్ ప్రైవేట్ జూనియర్ కళాశాల మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.గుండరెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. తొలుత నాన్ జంబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్ పరీక్షలని ప్రకటించిన ఇంటర్ బోర్డు.. విద్యాశాఖ మంత్రి ఆదేశాలతో ఎలాంటి అధ్యయనం లేకుండానే జంబ్లింగ్ విధానంపై ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది ఆక్షేపించారు.
ఐతే.. గతంలో కొవిడ్ వల్ల నాన్ జంబ్లింగ్ విధానం అనుసరించామని.. ఇప్పుడు వైరస్ తగ్గినందున జంబ్లింగ్‌కు నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. బోర్డు నిర్ణయంపై కళాశాల యాజమాన్యాలు తప్ప.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి అభ్యంతరం లేదని వివరించారు. ఈ దశలో స్పందించిన హైకోర్ట్ ధర్మాసనం.. పాత నిర్ణయాన్ని మార్చుకోవడానికి ప్రభుత్వం వద్ద సరైన కారణం లేదని చివరిదశలో పరీక్షల నిర్వహణ విధానాన్ని మార్చడం సరికాదని పేర్కొంది. కేవలం వారం రోజుల ముందు సమాచారం ఇచ్చి జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడంతో విద్యార్థులు, విద్యా సంస్థలు ఒత్తిడికి గురవుతారని వ్యాఖ్యానించింది. విద్యార్థులు, విద్యా సంస్థల ప్రయోజనాల దృష్ట్యా బోర్డు ఉత్తర్వుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
పూర్వం నిర్వహించిన పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. కొత్త షెడ్యూల్‌ను వారం రోజుల్లో ప్రకటిస్తామని తెలిపింది.
ఇంటర్ పరీక్షలకు కొత్త షెడ్యూల్..
ఇప్పటికే రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. గతంలో ప్రకటించిన పరీక్ష తేదీలను వాయిదా వేసి.. కొత్త తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు జరుగనున్నాయి. విద్యాశాఖ ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28 వరకు జరగాల్సి ఉంది. జేఈఈ మెయిన్ పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండు రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
ఇదీ చదవండి:
World Kidney Day: నానాటికీ పెరుగుతున్న కిడ్నీ రోగులు.. కారణాలేంటి..?