గుంటూరు జిల్లా పల్నాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గురజాల, దాచేపల్లి, మాచవరం మండలం పిడుగురాళ్లలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాచేపల్లి మండలంలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి కాట్రపాడు వాగులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మాచవరం మండలం నాగేశ్వరపురం తండా సమీపంలో పిల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అటువైపు వెళ్ళే మార్గాలు పూర్తిగా నిలిపివేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పిడుగురాళ్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కాలనీ పూర్తిగా జలమయమైంది.
భారీ వర్షాలకు ఎక్కడైనా కరెంటు తీగలు తెగిపడినా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగినా, వాటిని ముట్టుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: గుంటూరు జిల్లాలో వాగు దాటుతూ వ్యక్తి గల్లంతు