Diseases effect on cotton: పత్తి ఎకరాకు పది క్వింటాళ్లొస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. గులాబీ పురుగు, భారీ వర్షాల దెబ్బకు నాలుగు క్వింటాళ్లకు పడిపోయింది. రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణంలో 90%పైగా పంటపై ఈ ప్రభావం పడింది. తొలితీత పత్తి క్వింటా రూ.8వేలకు పైగా అమ్మిన రైతులకు ఇప్పుడు నాణ్యత దెబ్బతినడంతో రూ.6వేలు కూడా లభించడం లేదు. వీటన్నిటి మూలంగా ఎకరాకు రూ.20వేలైనా మిగులుతాయని నెలన్నర కిందట ఆశపడ్డ అన్నదాతలకు.. ఇప్పుడు లాభం మాట అటుంచి పెట్టుబడుల్లోనే రూ.10వేల వరకు నష్టపోయే పరిస్థితి ఎదురైంది.
పత్తి పీకేసి.. ప్రత్యామ్నాయ పంటల దిశగా..
Pink worm effect on cotton: కర్నూలు జిల్లాలో తొలుత వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి దిగుబడులు తగ్గాయి. తర్వాత వర్షాలు అధికం కావడంతో మరింత దెబ్బతింది. దీంతో పలువురు రైతులు పత్తిని పీకేసి.. ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. గుంటూరు, కృష్ణా, అనంతపురం, కడప జిల్లాల్లో భారీవర్షాలతో కాపు రాలిపోయింది. ఇదే సమయంలో గులాబీ పురుగు విజృంభించింది. కాయల్లోపలకు చేరడంతో.. గుల్లలు సగానికి విచ్చుకుని పుచ్చిపోయిన పత్తి వస్తోంది. చేసేది లేక గొర్రెల మేతకు వదిలేశామని గుంటూరు జిల్లా క్రోసూరు మండలం అనంతవరం రైతులు చెప్పారు.
పతనమైన ధరలు..
నవంబరులో పత్తి క్వింటా రూ.8వేల నుంచి రూ.9వేల మధ్య పలికింది. చిరుజల్లులు పడటంతో 10 రోజుల్లోనే ధరల పతనం ప్రారంభమైంది. వానకు తడవడం, గులాబీ పురుగు ఆశించిన గుల్లలు పుచ్చుగా రావడంతో నాణ్యత తగ్గింది. ఎకరాకు రూ.4,500 నుంచి రూ.5వేల మధ్యనే అడుగుతున్నారని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడు రైతు శివయ్య, నాదెండ్ల మండలం సాతులూరు రైతు చల్లా కోటేశ్వరరావు తదితరులు వాపోయారు. ‘మూడెకరాల్లో పత్తి వేస్తే ఎకరానికి 5 క్వింటాళ్ల చొప్పున వచ్చింది. మిరప తోటలూ పోయాయి. ఈ ఏడాది బాగా నష్టపోయాం, ప్రభుత్వమే ఆదుకోవాలి’ అని గుంటూరు జిల్లా క్రోసూరు మండలం అనంతవరం రైతు ఆంజనేయులు కోరారు.
ఎకరాకు రూ.17వేల పరిహారం ఇచ్చిన పంజాబ్
గులాబీ పురుగు కారణంగా పంజాబ్‌లో పత్తి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. రైతుల్ని ఆదుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.17వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. పత్తి తీతలపై ఆధారపడిన కూలీలకు సాయం అందిస్తామని తెలిపింది. రాష్ట్రంలోనూ గులాబీ పురుగుతోపాటు భారీవర్షాలతో నష్టం అధికంగా ఉన్న నేపథ్యంలో.. ప్రత్యేక సాయం అందించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి..
Centre On AP Medical Colleges: రాష్ట్రంలో 3 కొత్త వైద్య కళాశాలలకు కేంద్రం ఆమోదం