HC On Jagananna Smart Town Layouts: లేఅవుట్లలో 5 % స్థలాన్ని వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టు కేటాయించాలంటూ గతేడాది డిసెంబర్ 6 న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 145ను... సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శ , కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది. కౌంటర్ దాఖలు చేశాక మధ్యంతర ఉత్తర్వులిచ్చే వ్యవహారంపై ఆలోచన చేస్తామని తెలిపింది. లేఅవుట్లలో 5 శాతం స్థలాన్ని పొందేందుకు వీలుగా ఏపీ భూ అభివృద్ధి నిబంధన 13 ( 1 ) (డి) కి సవరణ చేసి, అందుకు అనుగుణంగా జీవో 145 జారీచేయడాన్ని సవాలు చేస్తూ విశాఖపట్నానికి చెందిన ప్రకృతి అవెన్యూస్ ఫర్మ్ మేనేజింగ్ భాగస్వామి మేడికొండూరి లక్ష్మి శకుంతల దేవీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
అందుకు ఏ చట్టం అనుమతించదు..
ప్రైవేటు లేఅవుట్లలో 5 శాతం స్థలం జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని జీవోలో పేర్కొన్నారన్నారు. లేఅవుట్లో ఇవ్వలేకపోతే 3 కి.మీ దూరంలో స్థలాన్ని ఇవ్వాలని... లేదా ఆ స్థలానికి మౌలిక విలువ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆ విధంగా కోరేందుకు ప్రభుత్వానికి అధికారం లేదన్నారు. అందుకు ఏ చట్టం అనుమతించదని తెలిపారు. నిబంధనలకు కొత్తగా సవరణ చేయడం ద్వారా ఎలాంటి పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం భూమి తీసుకోవడానికి యత్నిస్తుందన్నారు. 5 శాతం స్థలంతో సంబంధం లేకుండా లేఅవుట్ అనుమతి కోసం పిటిషనర్ పెట్టుకున్న దరఖాస్తును అనుమతించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ప్రస్తుతం అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపిన ధర్మాసనం .. ప్రభుత్వం కౌంటర్ వేశాక పరిశీలిస్తామని తెలుపుతూ... ప్రతివాదులకు నోటీసులిచ్చింది. విచారణను ఈనెల 25 కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: లేఅవుట్లలో 5 శాతం ఇవ్వాలన్న నిర్ణయంపై హైకోర్టులో వ్యాజ్యం