HC Adjourned Chandrababu Bail Petition Hearing: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థకు చెందిన నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో.. ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. బెయిలు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రధాన వ్యాజ్యంపై విచారణ తేలేంతవరకు మధ్యంతర బెయిలు ఇవ్వాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి నేడు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి వాయిదా వేశారు. రాజకీయ ప్రతీకారంతో తనను ఈ కేసులో ఇరికించారని.. చంద్రబాబు నాయుడు తన పిటిషన్లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత అకస్మాత్తుగా తన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు.
ఇప్పటికే తనను పోలీసు కస్టడీలోకి తీసుకొని సీఐడీ రెండు రోజులపాటు విచారించిందని తెలిపారు. మరో అయిదు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు. కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం లేదన్నారు. ఇప్పటికే ఈ కేసులో సాక్ష్యాధారాలను దర్యాప్తు సంస్థ సేకరించిందన్నారు. తమ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా ఏసీబీ కోర్టు బెయిలు పిటిషన్‌ను కొట్టేసిందన్నారు.
ప్రజా జీవితంలో ఉన్నానని.. చట్టాన్ని గౌరవించే వ్యక్తినని పేర్కొన్నారు. దర్యాప్తునకు సహకరిస్తానని తెలిపారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని అన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
Chandrababu Petitions in AP High Court: అప్పటివరకూ చంద్రబాబును అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
Chandrababu Quash Petition Hearing in Supreme Court: మరోవైపు ఇదే కేసులో సుప్రీంకోర్టులో సైతం విచారణ జరుగుతోంది. దీనిపై విచారణ 9,10వ తేదీలలో జరగగా.. తదుపరి విచారణను శుక్రవారానికి (13వ తేదీ) వాయిదా వేసింది. ఇప్పటికే చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై వాడీవేడిగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే వాదించగా.. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. 17ఏపై తీవ్రంగా చర్చ జరిగింది.
చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే సుదీర్ఘ వాదనలు విన్నాక.. ఈ కేసులో వాస్తవాలను పరిశీలించినప్పుడు సెక్షన్ 17ఏ వర్తించేలా కనిపిస్తోందని.. జస్టిస్ అనిరుద్ధబోస్ వ్యాఖ్యానించారు. అవినీతిని నిరోధించడం.. ప్రజాప్రతినిధులపై ప్రతీకార చర్యలు ఉండకూడదన్నదే 17A చట్ట సవరణ ప్రధాన ఉద్దేశమని హరీష్ సాల్వే అన్నారు.
17ఏ చట్టసవరణ అనేది నేరస్థులకు రక్షణ కవచంగా మారకూడదని సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గీ వ్యాఖ్యానించారు. నిజాయతీపరులైన అధికారులు, ప్రజాప్రతినిధులను అనవసర భయాల నుంచి దూరం చేసేందుకే 17ఏ సవరణ చేశారని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.