Guntur Voter List Update Details: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 143వ నెంబర్ పోలింగ్ కేంద్రమైన జూబిలేషన్ స్కూల్‌లోని ఓటర్ల జాబితాలో మెుత్తం 824 మంది ఉన్నారు. అశోక్ నగర్ లోని ఈ బూత్ పరిధిలో లేని 25 ఇంటి నంబర్లను గుర్తించారు. ఇంటి నంబర్లు లేనందున... వీటిని బోగస్ ఓట్లుగా అధికారులు భావిస్తున్నారు. చనిపోయిన 26 మంది పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయి. గతంలో 24 మంది మృతులు జాబితాలో ఉండగా... ఇద్దరు ఓటర్ల పేర్లను అధికారులు తొలగించారు. తాజాగా మరో నలుగురు మృతిచెందినా... ముసాయిదా జాబితాలో వారిని తొలగించలేదు.
ముసాయిదా జాబితా: గుంటూరు నగరానికి సంబంధం లేని బయటి వారు 25 మంది ఓటర్లు ఉన్నారు. 15 మంది ఎప్పుడో గుంటూరు నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 33వ డివిజన్ బూత్ నంబరు 143కు సంబంధించి.. అభ్యంతరాలు ఇచ్చినా ముసాయిదా జాబితాలో మార్పులు చేయలేదు. పాత జాబితానే విడుదల చేశారు. ఓటర్ల జాబితాలో ఫాంట్ సరిగా లేక... చూసేందుకు ఇబ్బందిగా ఉందని పలువురు చెబుతున్నారు.
Fake Votes in AP: వారం రోజుల్లో ఓటర్ల ముసాయిదా జాబితా.. అక్రమాలు పూర్తిగా సరిదిద్దకుండానే..!
ఓటర్లు గందరగోళానికి గురయ్యే పరిస్థితి: ఇంటి నంబర్ల మార్పునకు ఫారం-8 ఇచ్చినా.... చాలావరకు ఎలాంటి మార్పులూ జరగలేదు. పాత నంబర్లే ఇప్పటికీ ఉన్నాయి. లేని నెంబర్లు ముద్రించారు. నూతన జాబితాలో వరుస సంఖ్య 821లో... షమ్మీరాణి గూడపాటి పేరుతో ఓటు నమోదుచేశారు. ఇందుకు సంబంధించి ఇంటి నంబరు లేదు. అపార్టుమెంట్ పేరు లేదు. కానీ ప్లాటు నంబరు 23 అని మాత్రం ప్రింట్ చేశారు. కొన్ని ఓట్లకు పండరీపురం నాలుగోలైను అని చిరునామా మాత్రమే ఇచ్చారు. ఇంటినంబరు, ప్లాటు నంబరు లేదు. ఇలా 15 ఓట్లు నమోదు చేశారు. వీరందరూ అదే వార్డులో నివాసం ఉన్నా.... వారికి ఓటరు ఐడీ నంబరు కొడితే కానీ ఏ బూత్ పరిధిలో ఓటు ఉందో తెలియదు. ఇంటి నంబర్లతో కొత్త జాబితా ముద్రించకుండా పాత ఇంటినంబర్లే ఇచ్చారు. దీంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే పరిస్థితి నెలకొంది.
ఓటింగ్‌కు వెళ్లలేని పరిస్థితి: 143వ బూత్ పరిధిలో పండరీపురం ఐదో లైనులో పూజా ఆర్కిడ్ అపార్టుమెంట్‌లో తిరువీధి రామకృష్ణయ్య కుటుంబం నివసిస్తోంది. ఇదే బూత్ పరిధిలో వరుస సంఖ్య 41తో తిరువీధి రామకృష్ణయ్య పేరు ఉండగా... ఆయన భార్య వరుస సంఖ్య 173గా, కుమార్తెది 174గా, మరో కుమార్తె వరుస సంఖ్య175తో జాబితా ఇచ్చారు. వారి కుమారుడిది ఇదే వార్డులో 122వ బూత్‌లో వరుస సంఖ్య 160లో ఓటు నమోదైంది. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు బూత్‌లలో నమోదైనా వాటిని.. మార్పు చేయలేదు. కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకునేవారు ఒక బూత్ పరిధిలో దరఖాస్తు చేసుకుంటే.. అక్కడ కాకుండా వేర్వేరు బూత్‌ల్లోకి వెళ్తున్నాయి. అందరూ కలసి ఒకేసారి ఓటింగ్‌కు వెళ్లలేని పరిస్థితి ఎదురై.. ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. ఒకే వ్యక్తికి రెండుచోట్ల ఓటు ఉంటే వాటిని మాత్రం... కొత్త జాబితాలో లేకుండా తొలగించారు.