Guntur Textile Park Problems : జౌళి పరిశ్రమ ఉపాధి కల్పనలో దేశంలో రెండో అతిపెద్ద పరిశ్రమ. దేశంలో వస్త్రాల తయారీని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో 2014లో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందులో ఏపీలో రెండు చోట్ల పార్కుల ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది. స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలున్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట మండలం గోపాలంవారిపాలెంలో టెక్స్ టైల్ ఏర్పాటుకు స్థానిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. 61 యుూనిట్ల స్థాపన దిశగా అడుగువేశారు. వీవింగ్ ప్రాసెసింగ్ యూనిట్లు -5, వీవింగ్ యూనిట్లు 54, గార్మెంట్ -2 యూనిట్ల చొప్పున ఏర్పాటుకు నిర్ణయించారు. 9 ఏళ్లు గడిచినా టెక్స్ టైల్ పార్కులో ఇప్పటివరకు 9 యూనిట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి.
విద్యుత్ ఖర్చులో రాయితీ : ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మందగమనం కారణంగా యూరప్, అమెరికా దేశాల నుంచి అనుకున్నంత గిరాకీ లేకపోవడం దేశీయంగానూ డిమాండ్ కరవై ఉత్పత్తైన వస్త్ర నిల్వలు పేరుకుపోతున్నాయి. 2014లో 30 శాతం క్యాపిటల్ సబ్సిడీ రాయితీని కేంద్రం ప్రకటించగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారు. మళ్లీ ఈ సబ్సిడీని కుదించడంతో చాలా మంది యూనిట్ల స్థాపనకు వెనక్కి తగ్గారు. టెక్స్‌టైల్ పార్కులకు ప్రోత్సాహంగా రాష్ట్ర ప్రభుత్వం 1520 పాలసీని తెచ్చినప్పటికీ ఇది ఆచరణకు నోచకోకపోవడంతో చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అలాగే యూనిట్‌కు విద్యుత్తులో రెండు రూపాయల వరకు రాయితీలు కోరుతున్నారు. విద్యుత్ ఖర్చులో ప్రభుత్వం ఇస్తానన్న రాయతీలు కూడా అందడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చుతున్నారు.పెద్ద పరిశ్రమను ప్రోత్సహిస్తే పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు తిరిగి ప్రభుత్వానికి చేరే అవకాశముందని వారు గుర్తు చేస్తున్నారు.
వేల మందికి ఉపాధి : గుంటూరు టెక్సు టైల్ పార్కు ఏర్పాటుకు, 9 యూనిట్ల స్థాపనకు సుమారుగా 190 కోట్ల వరకు వ్యయమైంది. దీనిపై ఆధారపడి వందలాది మంది కార్మికులున్నారు. పూర్తి స్థాయిలో 60 యూనిట్లు అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా 3 వేల మందికి, పరోక్షంగా 3 వేల మందికి ఉపాధి లభించే అవకాశముంది. ఈ ప్రాంత అభివృద్ధి సైతం ఊపందుకునే అవకాశముందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.
యూనిట్ యజమానులు డిమాండ్ : కోట్లాది రూపాయల వ్యయం, వేలాది మంది కార్మికులకు ఉపాధి, ఈ ప్రాంత అభివృద్ధి దృష్ట్యా గుంటూరు టెక్సు టైల్ పార్కు అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సహకాలు అందించాలని యూనిట్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు.
"ఈరోజు ప్రపంచంలో ఈ పరిశ్రమ ముందుకు వెళ్లాలంటే ప్రభుత్వం సహాయం చేయాలి. ముఖ్యంగా పాత బకాయిలను వెంటనే ఇవ్వాలని కోరుతున్నాము. దేశంలో లేని విధంగా మన రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు ఉన్నాయి. విద్యుత్ చార్జీలను తగ్గించాలి. ప్రభుత్వం ఇస్తానన్న రాయితీ ఇవ్వాలి."- యూనిట్ యజమానులు