గుంటూరు నుంచి దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర, కొల్లూరు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. రోడ్డు అధ్వానంగా మారటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఈ రహదారిపై మూడేళ్ల కిందట రైల్వే పైవంతెన పనులకు శ్రీకారం చుట్టారు. 28 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆర్వోబీని నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 16.10 కోట్లు కాగా... రైల్వే వాటా 11.90 కోట్లు. రైల్వేశాఖ పరంగా చేపట్టాల్సిన పనులు కొనసాగుతుండగా... రహదార్లు, భవనాల శాఖ నుంచి చేపట్టాల్సిన పనులు మాత్రం ఆగిపోయాయి.
తరచూ ప్రమాదాలు
గతంలో రైల్వే గేటు మూలంగా విపరీతమైన ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడే స్థానికులు... మూడేళ్ల కిందట ఆర్వోబీ పనులు ప్రారంభం కాగానే ఎంతో సంతోషించారు. కానీ ప్రస్తుతం వారి పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి జారినట్లయింది. ఇప్పటివరకు గుత్తేదారు 5 కోట్ల 75 లక్షల విలువైన పనులు పూర్తి చేశారు. 21 స్తంభాల్లో 19 స్తంభాలను నిర్మించారు. కానీ.. కీలకమైన ఆర్.ఈ. వాల్స్, శ్లాబు నిర్మాణం, సిమెంట్ సర్వీసు రోడ్డు, అప్రోచ్ రహదార్లు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. ఫలితంగా.. పాదచారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడుగడుగునా గుంతలుపడి... రాళ్లు తేలుతున్న కారణంగా.. వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
పనులు ఆగిపోవడానికి కారణమిదే..
గుంటూరు బస్టాండ్ నుంచి దుగ్గిరాల, తెనాలి వైపు పోయే ప్రధాన రహదారి కావటంతో నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తాయి. రహదారి అధ్వానంగా మారటంతో బస్సులు, వాహనాల జీవితకాలం దెబ్బతింటోంది. వాహనాల మరమ్మతుల కోసం భారీగానే వెచ్చించాల్సి వస్తోందని వాహనదారులు, ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. రైల్వే పైవంతెన పనులు నిలిచిపోవడానికి నిధుల కొరత, గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడమే కారణమని తెలుస్తోంది. ఇప్పటికైనా ఆర్వోబీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని... తమను నరకయాతను నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.