గుంటూరు జిల్లాలో మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే వార్తలు సరికావని డీఐజీ త్రివిక్రమ వర్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఘటన జరిగిన రోజు అర్థరాత్రి ఒంటి గంట సమయంలో బాధితులు సత్తెనపల్లి స్టేషన్‌కు రాగానే పోలీసులు వెంటనే స్పందించారన్నారు. వారి నుంచి వివరాలు తీసుకుని తక్షణమే మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. సత్తెనపల్లి పోలీసులు కూడా బాధితులను తీసుకొని ఘటనా స్థలానికి వెళ్లినట్లు తెలిపారు. అదే రోజు రాత్రి 2గంటలకే మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. జరిగిన ఘటనపై ఐపీసీ సెక్షన్ 376 D, 394, 342 కింద కేసు నమోదు చేశామన్నారు.
ఈ ఘటనలో పోలీసులు ఎలాంటి అలసత్వం వహించలేదని డీఐజీ త్రివిక్రమ వర్మ స్పష్టం చేశారు. ఇక జీరో ఎఫ్ఐఆర్ అనేది ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లలేకపోతే మాత్రమే నమోదు చేస్తారని తెలిపారు. కానీ ఈ ఘటనలో సత్తెనపల్లి పోలీసులు వెంటనే స్పందించి ఘటనా స్థలికి వెళ్లారని.., మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చారని వివరణ ఇచ్చారు. రెండు స్టేషన్లకు సంబంధించిన పోలీసులు సమన్వయంతో కేసును విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే అత్యాచార ఘటనకు సంబంధించి కొన్ని ప్రసార మాధ్యమాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. సున్నితమైన అంశాలు, మహిళలపై అత్యాచారానికి సంబంధించిన వార్తలు ప్రసారం చేసేటప్పుడు వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు.
ఏం జరిగిందంటే...
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పరిధిలో గురువారం మహిళపై సామాహిక అత్యాచారం జరిగింది. సత్తెనపల్లికి చెందిన మహిళ మేడికొండూరు మండలం పాలడుగులోని బంధువుల ఇంట్లో జరిగిన వేడుకకు వెళ్లింది. తన భర్తతో కలిసి సత్తెనపల్లికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. పాలడుగు క్రాస్‌రోడ్డులో వెళ్తుండగా రోడ్డుపై చెట్టు పడి ఉంది. చెట్టు పక్కగా వెళ్తుండగా బైక్‌కి కర్ర అడ్డుపెట్టారు. దీంతో దంపతులిద్దరూ కింద పడ్డారు. రాత్రి 9.45 గంటల సమయంలో మార్గమధ్యలో వారిని దుండగులు అడ్డుకున్నారు.
గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వారి వద్దకు వచ్చి కొడవళ్లు చూపించి బెదిరించారు. భర్తను చితకబాది..చేతులు,కాళ్లు కట్టేశారు. మహిళను పక్కకు తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశారు. మహిళ మెడలో ఉన్న మంగళ సూత్రం, బంగారు ఉంగరం, కాళ్ల పట్టీలు అపహరించుకెళ్లారు. కొడవళ్లు చూపిస్తూ జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. ఫిర్యాదు తీసుకునేందుకు అక్కడి పోలీసులు నిరాకరించినట్లు తెలిసింది.
అయితే సామూహిక అత్యాచారానికి సంబంధించి పోలీసులు సకాలంలోనే స్పందించారని సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి చెబుతున్నారు. బాధితులు సత్తెనపల్లి స్టేషన్‌కు రాగానే వారి నుంచి వివరాలు తీసుకుని మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అలాగే రెండు స్టేషన్లకు సంబంధించిన పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లటంతో పాటు నిందితుల కోసం గాలించినట్లు వివరించారు.
ఇదీ చదవండి
GANG RAPE: భర్తనుకొట్టి.. భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం!