Clean Andhra Pradesh: 'ఇంటింటికి తిరిగి తడి చెత్త పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలి. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ సహకరించాలి. చెత్తపై పన్ను చెల్లించాలి'. చెత్తపై పన్ను వేసే సమయంలో గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు చెప్పిన మాటలివి. కానీ చెత్త సేకరణ కోసం తెచ్చిన బ్యాటరీ ఆటోలను వినియోగించకుండా మూలన పడేశారు. ఫలితంగా ట్రాక్టర్లతో చెత్త తరలించటానికి ఇంధన వ్యయం అధికమవుతోంది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయటంలో చూపిన ఉత్సాహం ప్రజాధనాన్ని సద్వినియోగం చేయటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజాధనం వృధా: గుంటూరు నగరంలో చెత్తను సులువుగా తరలించేందుకు నగర పాలక సంస్థ బ్యాటరీ వాహనాలను కొనుగోలు చేసింది. నాలుగు నెలలు నుంచి ఈ వాహనాలను ఉపయోగించకుండా వెహికల్ గ్యారేజీలోనే నిలిపి ఉంచారు. ప్రతి నెల నగరంలో చెత్తను తరలించేందుకు 30 ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు. ట్రాక్టర్లను వినియోగించడం వలన ఇందన వ్యయం 25 లక్షల రూపాయల వరకూ అవుతోందని, ఈ బ్యాటరీ వాహనాలను ఉపయోగించుకుంటే నెలకు 25 లక్షల రూపాయలు ఆదా అయ్యేదని నగర వాసులు అభిప్రాయ పడుతున్నారు. ఈ బ్యాటరీ వాహనాలను కూడా వాడుకోకుండా మూలన పడేయడం, కొన్ని ట్రాక్టర్లు నిర్వహణ లోపం కారణంగా సమస్యలు తలెత్తడం, రోజు రోజుకు ఇంధన వ్యయం అధికమవ్వడంతో ప్రజాధనం వృధా అవుతోందని నగర వాసుల్లో అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
" నిధులని దుర్వినియోగం చేస్తూ, స్వచ్చాంధ్రప్రదేశ్ కింద కేంద్రం నిధులను విడదల చేస్తే వాహనాలను కొనుక్కోని మూలన పడేసిన పరిస్థితి గత నాలుగు నెలలుగా ఉంది. నాలుగు నెలల నుంచి ఆ వాహనాలను వినియోగించకపోవడంతో పాడైపోతాయి. ఇంజన్లు స్ట్రక్ అయిపోతాయి, టైర్లు ఎండకు ఎండి, వానకు తడిసి పాడైపోయి అరిగిపోతాయి. వాటికి సంబంధించిన మైకులు, సీసీ కెమెరాలు పని చేయవు. వాటిని ఏ అధికారి పట్టించుకోవడం లేదు. వాటిని ఉపయోగించకపోవడం దారుణం." - శిరిపురపు శ్రీధర్‌శర్మ, గుంటూరు
" బ్యాటరీస్తో నడిచే ఈ -ఆటోల వల్ల కార్పోరేషన్ ఆదాయం మిగిలే అవకాశం ఉన్నా గానీ అధికారులు ఎందుకో వాటి గురించి పట్టించుకోవడం లేదు. నిరుపయోగంగా వెహికల్ షెడ్లో ఉంచారు. గత నవంబర్లో కూడా యూనియన్ పరంగా అడిగాము. " - రవికుమార్, జనరల్ సెక్రెటరీ, గుంటూరు మున్సిపల్ వర్కర్స్ యూనియన్
ఇవీ చదవండి