గుంటూరు జిల్లాకు చెందిన కొందరు స్థానిక ఎన్నికల్లో రాణించి ఎమ్మెల్యే, ఎంపీలుగా చట్టసభల్లోకి ప్రవేశించారు. మండల రాజకీయాల్లో తమదైన ముద్రవేసి రాష్ట్ర స్థాయిలోనూ సత్తా చాటారు. స్థానికంలో వారు కొట్టిన బోణి రాజకీయంగా గట్టి పునాది వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలుగా పని చేసి చట్టసభలకు వెళ్లిన వారి ప్రస్థానంపై ప్రత్యేక కథనం
ఎంపీపీ నుంచి ఎంపీగా..
రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మోపిదేవి వెంకటరమణ రాజకీయ ప్రస్థానం ఎంపీపీ నుంచి మొదలైంది. 1987లో ఆయన నిజాంపట్నం ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో చోటు సంపాదించారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందినా అధికార వైకాపా ఎమ్మెల్సీగా అవకాశమిచ్చింది. పశుసంవర్థక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించింది. కొన్నాళ్ల కింద రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు.
సర్పంచిగా పనిచేసి...
వినుకొండ మండలం కోటప్పనగర్ గ్రామ సర్పంచిగా మక్కెన మల్లికార్జునరావు రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికై వైస్ ఎంపీపీగా, ఇన్‌ఛార్జి ఎంపీపీగా పని చేశారు. జడ్పీటీసీ సభ్యుడిగా ఆయన పని చేశారు. 1999లో వినుకొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో విజయం సాధించారు. 2014లో ఓడిపోయారు. కొంతకాలం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు.
జడ్పీటీసీగా మొదలు..
రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత రాజకీయ ప్రస్థానం పరిషత్ ఎన్నికలతోనే మొదలైంది. 2006లో ఫిరంగిపురం మండలం నుంచి జడ్పీటీసీ సభ్యురాలిగా ఆమె గెలుపొందారు. 2009లో ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2012 ఉప ఎన్నికలోనూ అదే స్థానం నుంచి గెలుపొందారు. 2014లో ఓటమి పాలయ్యారు. 2019లో విజయం సాధించి హోం మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యేగా..
సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి 1995లో తన స్వగ్రామమైన లంకెలకూరపాడు నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో కాంగ్రెస్, 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
జడ్పీటీసీతో ప్రారంభమై...
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2006లో వెల్దుర్తి జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాచర్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2012 ఉప ఎన్నిక, 2014, 2019 సాధారణ ఎన్నికల్లోనూ గెలుపొందారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా ఉన్నారు.
మొదట ఎమ్మెల్యే.. ఆనక ఎంపీపీ, జడ్పీటీసీ..
దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డికి అరుదైన రికార్డు ఉంది. ఆయన పదేళ్ల పాటు సర్పంచిగా పని చేసిన అనంతరం 1983లో తెదేపా నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పదవీ కాలం పూర్తయిన తరువాత స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. 1995లో కొల్లిపర ఎంపీపీగా, 2001లో జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై సేవలందించారు.
ఇదీ చదవండి