గుంటూరు జిల్లా నరసరావుపేటలో శనివారం నుంచి 10రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు దీనికి సహకరించాలని కోరారు. లేదంటే భవిష్యత్తులో నరసరావుపేటలో వేల కేసులు చూడాల్సివస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సంపూర్ణ లాక్ డౌన్ సమయంలో పట్టణంలోకి ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రావొద్దని ఎమ్మెల్యే కోరారు. ఒకవేళ వస్తే వారికి కొవిడ్ టెస్టులు చేసి నెగెటివ్ వస్తేనే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అలాగే పట్టణ ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని కోరారు. మందులు, పాల దుకాణాలు, ఆసుపత్రులు మాత్రమే తెరచి ఉంటాయన్నారు. ప్రజలకు కావల్సిన నిత్యావసరాలు, కూరగాయలు ఇళ్లవద్దకే తోపుడు బండ్ల మీద వస్తాయని తెలిపారు.
లాక్ డౌన్ పూర్తయ్యాక నరసరావుపేటలో ప్రజలు బయటకు వచ్చేందుకు కుటుంబానికి ఒక పాస్ చొప్పున ఇస్తామని తెలిపారు. దాని ద్వారా ఒక్కరు మాత్రమే బయటకు వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేయాలని చెప్పారు. ఈ విధంగా 3 నెలలపాటు చేయాల్సి ఉంటుందన్నారు. అప్పుడే వైరస్‌ను నియంత్రించగలమని ఎమ్మెల్యే వివరించారు. ఈ లాక్ డౌన్‌కు పట్టణ ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఇవీ చదవండి...