కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పిలుపునిచ్చారు. గుంటూరు జీజీహెచ్‌లో ప్లాస్మా సేకరణ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కొవిడ్ రోగుల మరణాలు తగ్గించే క్రమంలో ప్లాస్మా చికిత్సను గుంటూరు జీజీహెచ్, ఎన్.ఆర్.ఐ ఆసుపత్రుల్లో మొదలుపెట్టామని తెలిపారు.
ప్లాస్మా సేకరించేందుకు జీజీహెచ్, రెడ్ క్రాస్తో పాటు 9 ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి 28-60 రోజుల మధ్యలో ప్లాస్మా సేకరిస్తామని చెప్పారు. ఒకరు ఇచ్చే ప్లాస్మా ఇద్దరి ప్రాణాలు రక్షించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఇక ఆసక్తి ఉంటే ఎవరైనా ఐఐటీలో సీటు కొట్టొచ్చు!