గుంటూరు జిల్లాలో వాన్ పిక్ భూములను కొందరు ఆక్రమించారని... వెంటనే వాటిని ఖాళీ చేయాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆదేశించారు. నిజాంపట్నం మండలం పరిధిలోని వాన్ పిక్ భూములను ఆయన పరిశీలించారు. వాన్ పిక్ భూములలో ఆక్రమణలు తొలగించాలని రెవెన్యూ అధికారుల్ని ఆదేశించారు.
నిజాంపట్నం, ఆముదాలపల్లి, అడవులదీవి, దిండి గ్రామాలలో 2,079 ఎకరాల వాన్ పిక్ భూములు ఈడీ ఆధీనంలో ఉన్నాయని... వాటిని రక్షించే బాధ్యత రెవెన్యూ శాఖకు అప్పగించారని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఇటీవలే ఈడీ అధికారులు భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటామని లేఖ పంపినట్లు చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో తాము పరిశీలించగా... అందులో 12వందల 57 ఎకరాలను కొందరు ఆక్రమించి రొయ్యల సాగు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ భూములను ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు స్వాధీన పరచాల్సి ఉన్నందున... ఆక్రమణదారులు స్వచ్ఛందంగా భూములను ఖాళీ చేయాలన్నారు. ఈడీ అధికారులకు కూడా ఆక్రమణదారుల వివరాలు అందించామని చెప్పారు. ఒకవేళ భూములు ఖాళీ చేయకుంటే వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి: మాయమాటలు చెప్పి సెల్ఫీ అంటాడు.. మార్ఫింగ్ చేసి డబ్బులు గుంజుతాడు