ప్రశ్న: గుంటూరు జిల్లాలో కరోనా కేసులు ఇంతగా పెరగటానికి కారణమేంటి?
జవాబు: మొదట్లో కేవలం గుంటూరు నగరం, పట్టణాల్లో మాత్రమే కరోనా ఉండేది. ఇపుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ చాలా వేగంగా విస్తరించింది. 70 శాతం కేసులు అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. జనసాంధ్రత అధికంగా ఉండటం దీనికి కారణం. కంటైన్మెంట్ ఎంత చేసినా జనాన్ని నియంత్రించగలమే గాని... వైరస్‌ని కాదు. మనం వదిలేసి ఉంటే మొత్తం జనాభాలో 15శాతం అంటే దాదాపు 4లక్షల కేసులు వచ్చేవి. కానీ అంతగా లేదు. మనం పరీక్షలు పెంచాం. చికిత్స, సౌకర్యాలు పెంచటం వల్లే మనం ప్రస్తుతం సురక్షితమైన స్థాయిలో ఉన్నాం.
ప్రశ్న: ప్రస్తుతం జిల్లాలో కొవిడ్ చికిత్సకు సంబంధించి ఆసుపత్రులు, అలాగే పడకల పరిస్థితి ఏమిటి?
జవాబు: మొత్తం 85 ఆసుపత్రులు గుర్తించాం. ముందుగా బోధనాసుపత్రులను కొవిడ్ వైద్యం కోసం వినియోగించాం. ఎందుకంటే అక్కడ పడకలు, సిబ్బంది ఎక్కువగా ఉంటారు. జీజీహెచ్, కాటూరి, ఎన్.ఆర్.ఐ లలోనే ఎక్కువమందిని ఉంచి చికిత్స ఇస్తున్నాం. వాటిలో కొవిడ్ కు అవసరమైన సౌకర్యాలు కల్పించాం. ప్రస్తుతం 35 ఆసుపత్రుల్లో 5వేల 500 పడకలు సిద్ధంగా ఉన్నాయి. అందులో 3 వేల 500 మందికి చికిత్స అందిస్తున్నాం. ఇంకా 3 వేల వరకూ పడకలు అందుబాటులో ఉన్నాయి. కేసులు పెరిగితే పడకలు పెంచుతాం. 48గంటల ముందు ఆసుపత్రికి నోటీసు ఇచ్చి దానిని స్వాధీనం చేసుకుంటాం. కాబట్టి పడకల విషయంలో ఇబ్బంది లేదు. గుంటూరు, పల్నాడు, డెల్టా అని మూడు ప్రాంతాలుగా విభజించి ఆయా ప్రాంతాల వారికి దగ్గర్లో ఆసుపత్రులు ఏర్పాటు చేశాం. కొద్దిపాటి లక్షణాలు ఉన్నవారిని సమీపంలోని ఆసుపత్రుల్లో ఉంచుతాం. కొవిడ్ లక్షణాలు పెద్దగా లేనివారిని కొవిడ్ కేర్ కేంద్రాల్లో ఉంచుతున్నారు. అక్కడ వారి ఒంటరితనం దూరం చేసేందుకు యోగా వంటివి ప్రారంభించారు.
ప్రశ్న: యోగా వంటి వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి?
జవాబు: కొవిడ్ రాగానే వారిని అంటరానివారిగా చూస్తున్నారు. ఇది మంచిది కాదు. వాళ్లు కోలుకుంటారు. వారికి పాలు,నీళ్లు, గ్యాస్ సరఫరా చేయకుండా అపటం సరికాదు. కొద్దిపాటి లక్షణాలు ఉన్నవారిని కొవిడ్ కేర్ కేంద్రాల్లో ఉంచుతున్నాం. వారికి యోగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. పతంజలి శ్రీనివాస్ మాస్టర్‌ను పిలిచి అడవి తక్కెళ్లపాడు కేంద్రంలో శిక్షణ ప్రారంభించాం. అక్కడ మంచి స్పందన రావటంతో మరో రెండు చోట్ల కూడా నిర్వహిస్తున్నాం. అక్కడి రోగుల్లో గతంలో ఉన్న భయం పోయింది. అందరితో కలిసి మాట్లాడుతున్నారు. గతంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేసేవారు. ఇపుడు వాళ్లే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతున్నారు. దీంతో అక్కడ కార్మికుల అవసరం ఎక్కువగా లేకుండా పోయింది. యోగా ద్వారా వారి శరీరానికి, ఆరోగ్యానికి మంచి జరగటంతో పాటు వైఖరిలోనూ మార్పు వచ్చింది. అంతా ఓ కుటుంబ సభ్యుల్లా మెలుగుతున్నారు. ఫలితాలు బాగున్నాయి. కాబట్టి మరో మూడు కేంద్రాల్లో త్వరలో యోగా తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
ప్రశ్న; జిల్లాలో ప్లాస్మా థెరపీని అందుబాటులోకి తెస్తున్నారు కదా.. ఎవరెవరికి దీనిని అందిస్తారు?
జవాబు: ప్రస్తుతం కొవిడ్‌కు కచ్చితమైన మందులు, వ్యాక్సిన్ లేని తరుణంలో ప్లాస్మా చికిత్స అద్భుతమని చెప్పాలి. కొవిడ్ నుంచి కోలుకున్న వారు తమ ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని కోరుతున్నా. పాజిటివ్ వచ్చిన 28వ రోజు నుంచి 60 రోజుల వరకూ ప్లాస్మా ఇవ్వవచ్చు. 400 ఎం.ఎల్ ప్లాస్మా సేకరిస్తే దాని ద్వారా ఇద్దరు కొవిడ్ రోగుల ప్రాణం కాపాడవచ్చు. అలాంటి మంచి పనిలో భాగస్వామ్యం కావాలి. ప్రస్తుతం రెడ్ క్రాస్ ద్వారా ప్లాస్మా సేకరణ జరుగుతోంది. ఎవరికి చికిత్స అందించాలనేది నిర్ణయించేందుకు రెండు కమిటీలు వేశాం. వారి ద్వారా మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది. చాలా జాగ్రత్తలు తీసుకుని ప్లాస్మా చికిత్స అందించాల్సి ఉంటుంది. అందుకే అందుకు తగ్గ చర్యలు చేపట్టాం.
ప్రశ్న: కొవిడ్ కిట్ల పంపిణీ ఎంతవరకు వచ్చింది?
జవాబు: ప్రస్తుతం కిట్ల తయారీ జరుగుతోంది. యాంటిజెన్ కిట్ల ద్వారా కొవిడ్ పరీక్షలు చేస్తున్నందున పాజిటివ్ వచ్చిన విషయం 15 నిమిషాల్లో తెలిసిపోతుంది. వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఆసుపత్రికి వెళ్లాలా లేక కొవిడ్ కేర్ సెంటరా అనేది నిర్ణయిస్తారు. ఎలాంటి లక్షణాలు లేనివారిని హోం ఐసోలేషన్ కు అనుమతిస్తున్నాం. వారికోసం కిట్లు తయారు చేస్తున్నాం. వాలంటీర్ల ద్వారా ఈ కిట్ల అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ఐసోలేషన్ లో ఉన్నప్పుడు ఏమైనా లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ఏ.ఎన్.ఎం కు సమాచారం ఇస్తే ఇంటివద్దకే మందులు పంపిస్తారు.
ప్రశ్న: కొవిడ్ కారణంగా మరణించిన వారి మృతదేహాలు తీసుకెళ్లే విషయంలో కొన్నిచోట్ల కుటుంబసభ్యులు వెనుకంజ వేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి? దీనిపై ప్రభుత్వ యంత్రాంగం ఏం చర్యలు తీసుకుంటోంది?
జవాబు: తీవ్రమైన లక్షణాలు ఉన్న వారికి చికిత్స అందించే జీజీహెచ్, ఎన్.ఆర్.ఐ, కాటూరి ఆసుపత్రుల్లోనే మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో మృతదేహాలు మార్చురీల్లో ఉంటున్నాయి. వారి బంధువులు తీసుకెళ్లటం లేదు. ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉన్నవారిని యజమానులు మృతదేహం తీసుకెళ్లేందుకు అనుమతీయటం లేదు. అలాగే కొందరు సొంత ఇళ్లు ఉన్నా ఇరుగుపొరుగు వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మృతదేహాలు తీసుకెళ్లటం లేదు. పీపీఈ కిట్లు ధరించి మృతదేహాలు ఖననం చేసేలా చర్యలు చేపట్టాం. దీనికోసం ప్రత్యేక యంత్రాంగం ఉంది. చనిపోయిన వారి బంధువులు మృతదేహాన్ని వారి గ్రామంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చు. వారు కూడా కొంచెం దూరంలో నిలబడి వారి వారి సంప్రదాయాల ప్రకారం చేయాల్సిన కార్యక్రమాలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం మాస్కు ధరిస్తే చాలు. మిగతా పని ప్రభుత్వ యంత్రాంగం నిర్వహిస్తుంది. ఎలాంటి అపోహలు వద్దని పదేపదే మనవి చేస్తున్నాం.
ప్రశ్న: స్వయంగా మీరే శ్మశానానికి వెళ్లి కొవిడ్ మృతుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇది ఎంతమేరకు ఉపయోగపడింది?
జవాబు: అవును. ప్రజలకు అవగాహన కల్పించేందుకు, ధైర్యం చెప్పేందుకు నేను స్వయంగా వెళ్లాల్సి వచ్చింది. తన అంత్యక్రియలు ఎలా జరగాలో, ఎవరెవరు రావాలో ప్రతి వ్యక్తికి ఒక కోరిక, ఆలోచన ఉంటుంది. కానీ కొవిడ్ తో మరణిస్తే వారిని అనాథలా అంత్యక్రియలు నిర్వహించటం అనేది వారిని అగౌరవపర్చటం.. అంతే కాదు అమానవీయం కూడా. అందుకే నేను ముందడుగు వేశాను. ఆ తర్వాత కొన్నిచోట్ల ఆర్డీవోలు, తహసీల్దార్లు, సీఐలు, ఎస్.ఐలు కూడా వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఇవి చూసి స్థానికంగా ఉన్న యువత తప్పకుండా ముందుకు వస్తుందని భావిస్తున్నా. వారి ద్వారా మృతుల కుటుంబాలు, బంధువుల్లో ధైర్యం వచ్చి అంత్యక్రియల్లో పాల్గొంటారని నా ఆశ.
ప్రశ్న: కొవిడ్ మరణాలు పెరుగుతున్న తరుణంలో శ్మశానాల్లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు ఎలా మెరుగుపరుస్తున్నారు? స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఏ మేరకు ఉంది?
జవాబు: కొవిడ్ తో పాటు, నాన్ కొవిడ్ మృతులు కూడా ఎక్కువగానే ఉంటున్నారు. అందుకే శ్మశానాల్లో సౌకర్యాలు సరిపోవటం లేదు. ప్రభుత్వం కూడా సౌకర్యాలు మెరుగుపర్చాలని ఆదేశించింది. అందుకే గుంటూరులోని శ్మశానాల్లో సౌకర్యాలు పరిశీలించాం. సౌకర్యాల మెరుగుదల కోసం స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించాం. స్థంబాల గరువులోని శ్మశానవాటికలో గ్యాస్ ద్వారా మృతదేహాలు కాల్చవచ్చు. అక్కడ అదనపు సౌకర్యాలు కల్పిస్తే అంత్యక్రియల సామర్థ్యం పెంచవచ్చు. దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నాం. అమ్మ అశ్రమంలో కొత్తగా అంత్యక్రియల ఏర్పాటు చేస్తున్నాం. 50 లక్షల వరకూ ఖర్చవుతుంది. ఇప్పటికే 30 లక్షల మేర నిధులు సమకూరాయి.
ప్రశ్న: చాలాచోట్ల ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్ చికిత్సకు నిరాకరిస్తున్నాయి. మరికొందరు ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీల కంటే చాలా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
జవాబు: వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన జీవో 77 ప్రకారం రోజుకు 11 వేలకు మించి బిల్లు వేసేందుకు వీల్లేదు. సాధారణ వార్డులో ఉంచితే రోజుకి 3వేలు దాటదు. దాని కంటే ఎక్కువ వసూలు చేస్తే ప్రజలు ఫిర్యాదు చేయాలి. అలాంటి ఆసుపత్రులపై చర్యలు తప్పవు. కొన్నిచోట్ల అనారోగ్యంతో వస్తే చికిత్స చేయటం లేదు. వచ్చిన వారికి వైద్యం అత్యవసరమైతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి రోగిని చేర్చుకోవాల్సిందే. అనుమానం వస్తే వారికి కొవిడ్ పరీక్ష చేయాలి. నెగిటివ్ వస్తే మెయిన్ బ్లాక్ లో చేర్చి వైద్యం అందించాలి. పాజిటివ్ వస్తే వారిని సమీపంలోని కొవిడ్ ఆసుపత్రికి పంపించేలా చర్యలు తీసుకోవాలి. దీన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం.
ప్రశ్న: కొవిడ్ వచ్చిన వారిపట్ల సమాజంలో ఉన్న వివక్ష గురించి ఏం చెబుతారు?
జవాబు: కరోనాని తరిమికొట్టే పని ప్రభుత్వానిది, అధికారులది మాత్రమే కాదు. మొత్తం సమాజానిది. ఎవరూ కూడా కావాలని కరోనా కోరి తెచ్చుకోరు. ప్రస్తుతం సామాజిక వ్యాప్తి దశలో ఉంది. అలాంటప్పుడు ఎవరి ద్వారా వస్తుందో కూడా తెలుసుకోవటం కష్టం. కొవిడ్ వచ్చిందని వారిని దూరంగా పెట్టడం, కొట్టడం వంటి చర్యలు దురదృష్టకరం. అలాగే కరోనా నుంచి కోలుకుని వచ్చాక వారిని ఇంట్లోకి రానీయాలి. అద్దె ఇళ్లో ఉన్నవారిపై యజమానులు సానుభూతి చూపాలి. వారికి ఏదైనా అవసరం వస్తే సాయం చేసేందుకు ముందుకు రావాలి. అందరూ కలిసికట్టుగా ఉంటేనే కరోనాని ఎదుర్కొంటాం. విజయం సాధిస్తాం. గుంటూరులో జైన సమాజం వాళ్లు ప్రత్యేకంగా క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు. ఇలా అన్ని వర్గాల వారు ముందుకొచ్చి తమవారి కోసం ఏదైనా చేయాలి.
ఇదీ చదవండి: రాజధానిలో పెట్టింది ప్రజల సొమ్ము.. ఖజానాకు నష్టం కదా..: హైకోర్టు