Govt Stopped Funds to YSR Jalakala Scheme: వైఎస్సార్ జలకళ పథకం (YSR Jalakala Scheme) ప్రకటన సందర్భంగా సీఎం జగన్ చెప్పిన మాటలు.. నిజమనుకుని నమ్మిన రైతులు నిలువునా మోసపోయారు. పథకం అమలు కోసం నియోజకవర్గానికి ఒక రిగ్గును ఏర్పాటు చేసి రైతుల భూముల్లో బోర్లు తవ్విస్తామని ప్రకటించిన సీఎం జగన్.. ఆదిలోనే మాటతప్పారు. రిగ్గుల సమీకరణ ప్రతిపాదన పక్కనపెట్టి ప్రైవేటు యజమానులకు బోర్లు తవ్వే కాంట్రాక్ట్ అప్పగించారు. తవ్విన బోర్లకు మోటార్ల ఏర్పాటు, విద్యుత్త్ సౌకర్యం కల్పించడంలోనూ ప్రభుత్వం మాట తప్పింది.
బోరుకు విద్యుత్తు సౌకర్యం కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చిన సీఎం జగన్.. ఆ తర్వాత రైతులే భరించాలని ప్లేటు ఫిరాయించారు. దీంతో ఇప్పటివరకు 3 వేల 684 బోర్లకే విద్యుత్తు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 2020లో ప్రారంభించిన జలకళ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 2,32,789 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. మూడేళ్లలో తవ్వింది మాత్రం 23,253 బోర్లే.పరిస్థితి ఇలానే కొనసాగితే 2024 మార్చి నాటికి రెండు లక్షల బోర్లు తవ్విస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేరే అవకాశమే లేదని రైతులు చెబుతున్నారు.
బోర్లు తవ్విన గుత్తేదారులకు మొదటి ఏడాది బిల్లులు చెల్లించి తర్వాత నుంచి ప్రభుత్వం జాప్యం చేసింది. దీంతో గుత్తేదారులు ఎప్పటికప్పుడు పనులు నిలిపేయడం, బిల్లులు చెల్లించాక మళ్లీ తవ్వడం నిత్యకృత్యంగా మారింది. ప్రస్తుతం 50 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అనేక జిల్లాల్లో పనులు నిలిచిపోయాయి. రాయలసీమ జిల్లాకు చెందిన ప్రైవేటు రిగ్గు యజమాని ఒకరు ఈ ఏడాది మేలో ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 175 బోర్లు తవ్వాల్సి ఉండగా.. గత ఐదు నెలల్లో ఆయన ఒక్క బోరు కూడా తవ్వలేదు.
గతంలో ఆయన తవ్వించిన బోర్లకు ప్రభుత్వం 50 లక్షలకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇప్పటికే అవస్థలు పడుతున్న ఆయన మరో 50 లక్షల పెట్టుబడులు పెట్టలేనని డ్రిల్లింగ్ పనులు ప్రారంభించలేదు. జలకళ పనులకు ఒప్పందం చేసుకున్న అనేక మంది గుత్తేదారులది కూడా ఇదే పరిస్థితి..
వైఎస్సార్ జలకళ పథకంలోనూ... మడమ తిప్పిన వైకాపా ప్రభుత్వం
ప్రభుత్వం బిల్లులివ్వని కారణంగా అప్పులపాలై ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గుత్తేదారులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో రైతులే చొరవ తీసుకుని గుత్తేదారులు తమ భూముల్లో తవ్వే బోర్లకు పెట్టుబడులు పెడుతున్నారు. కొన్ని జిల్లాల్లో మంత్రులు జోక్యం చేసుకుని బిల్లులు ఇప్పించే బాధ్యతను తీసుకుంటామని హామీ ఇచ్చి బోర్లు తవ్వించేలా గుత్తేదారులను ఒప్పిస్తున్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హామీపై నెల్లూరు జిల్లా సర్వేపల్లి మండలంలో.. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హామీతో నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో గుత్తేదారులు బోర్లు తవ్వుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలకు ముందు బోర్లు తవ్వించేందుకు తహతహలాడుతున్నారు.