రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమపథకాలు, ఇతర కార్యక్రమాలు పేద ప్రజలకు అందాలంటే మరోసారి జగన్ ను ఆశీర్వదించాలని.. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగులను అభ్యర్థించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలండర్ ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు అరుణ్ కుమార్, డొక్కా మాణిక్య వరప్రసాద్.. తదితరులు పాల్గొన్నారు.
చంద్రన్న కానుక మీరు ఎందుకు అమలు చేయడం లేదు. విదేశీ విద్య మీరు ఎట్లా మిస్ అవుతున్నరు.. అని మా పార్టీ కార్యకర్తలు కూడా అడుగుతున్నరు. కానీ, మూడున్నరేళ్లలో జరిగిన ప్రగతి ఎంతో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు వైఎస్ఆర్ పార్టీ డీఎన్ఏలో అంతర్భాగంగా ఉన్నరు. ఆయా వర్గాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పథకాలు సక్రమంగా అమలు చేసే బాధ్యత ఉద్యోగులు తీసుకోవాలి. - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు
దావోస్ సదస్సుకు వెళ్తే దుబారా అన్న నాయకులే... ఇప్పుడు ఎందుకు వెళ్లలేదని తమను ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని సజ్జల అన్నారు. గతేడాది దావోస్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు ఇపుడు ఫలాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ వెళ్లి ఎన్ని పెట్టుబడులు తెచ్చారని సజ్జల ప్రశ్నించారు. ఉపాధ్యాయ సంఘాల మాదిరిగా ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి సురేష్ సజ్జలకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే అప్పులు చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర చెప్పారు. రుణాలు ఇవ్వలేని ఎస్సీ కార్పొరేషన్ ను మూసేయాలన్న న్యాయస్థానం వ్యాఖ్యలపై సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ స్పందించారు. గత తెదేపా ప్రభుత్వం కంటే ఐదురెట్లు ఎస్సీలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందారని చెప్పారు. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ఆరోపించారు.
ఇవీ చదవండి :