Government School Students Drinking Water Problems: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు స్వచ్ఛమైన తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ బడుల్లో మంచినీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు.. పర్యవేక్షణ లోపంతో మూలనపడ్డాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీరు తాగి.. విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ సంస్థలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని సీఎం మెుదలుకుని మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు పదే పదే ప్రచారం చేసుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు సైతం అందించలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది.
సాహసం చేస్తేనే స్కూల్కు.. అడుగు తప్పితే అపాయమే.. దెబ్బతిన్న వంతెనపై విద్యార్థుల పాట్లు
RO Plants Not Working: పని చేయని ఆర్వో ప్లాంట్లు: పల్నాడు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు అలంకారప్రాయంగా మారాయి. నరసరావుపేట మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ రెండేళ్లుగా మూలనపడింది. పిడుగురాళ్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోనూ ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదు. దాతల సాయంతో వాటర్ క్యాన్ల(water cans) ద్వారా విద్యార్థులకు తాగునీరు అందజేస్తున్నారు.
విద్యార్థులకు అందుబాటులో లేని మంచినీరు: పెదకూరపాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో దాతలు 2 లక్షల రూపాయలతో ఆర్వో ప్లాంట్ సమకూర్చారు. కొన్ని నెలలుగా ఆర్వో ప్లాంట్ తరుచుగా మరమ్మతులకు గురైందని ఉపాధ్యాయులు తెలిపారు. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని స్కూళ్లలో తాగునీటి కోసం విద్యార్థుల ఇక్కట్లు తప్పడం లేదు. మాచవరం పాఠశాలకు ఆర్వో ప్లాంట్ మంజూరై ఏడాది గడిచినా.. నేటికీ విద్యార్థులకు శుద్ధ జలం అందుబాటులోకి రాలేదు.
No Transport to students: బస్సులు లేక.. ప్రమాదకరంగా ఆటోలో ప్రయాణం
Nadu-Nedu works slow: నిధులు లేక నత్తనడకన పనులు: నాడు-నేడులో భాగంగా మెుదటి దశలో కొన్ని పాఠశాలలకు మాత్రమే ప్రభుత్వం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసింది. రెండో దశలో ఉన్న బడులకు గదుల నిర్మాణం పూర్తయిన తరువాతే ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొన్నిచోట్ల నాడు-నేడు పనులు నత్తనడకన సాగుతున్నాయి.
Students Facing Water Problems: ఇంటి నుంచి తెచ్చిన నీరు సరిపోక దప్పికతో ఇబ్బంది: గుంటూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడా నాడు-నేడు పనులు పూర్తి కాలేదు. దీంతో విద్యార్థులు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. మున్సిపల్ నీరు తాగలేక, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బాటిల్ నీళ్లు సరిపోక.. దప్పికతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లోని ఆర్వో ప్లాంట్లకు.. మరమ్మతులు చేసేలా చర్యలు చేపట్టాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు.