Government Does Not Care The Concerns Of Anganwadi: రాష్ట్రంలో అంగన్వాడీల ఆందోళనలపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టమని తాము చెప్పలేదని మంత్రులు చెబుతున్నారు. కానీ అధికారులు మాత్రం బలవంతంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి వాలంటీర్లకు అప్పజెబుతున్నారు. దీనిపై అంగన్వాడీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
Anganwadi Centers Locks Are Forcibly Broken: గుంటూరు, ఉండవల్లిలో రాత్రి వేళలో అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. గుంటూరు వేళాంగిణి నగర్‌లోని అంగన్వాడీ కేంద్ర తాళాన్ని పోలీసుల సమక్షంలో వీఆర్వో పగలగొట్టించారు. రాత్రి 9 గంటలకు అంగన్వాడీ కార్యకర్తలను పక్కకుతోసి తలుపులు తెరిచి సరకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంగన్వాడీల మాటలు లెక్క చేయని సచివాలయ సిబ్బంది కొత్త తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచేందుకు వీఆర్వో యత్నిస్తుండగా కార్యాకర్తలు అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించకుండా తాళాలు తీస్తే ఒప్పుకోమన్నారు. వీరికి మద్దతుగా తెలుగుదేశం, జనసేన, సీపీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలంటూ కేంద్రం వద్ద బైఠాయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న నేతలను బలవంతంగా పక్కకు లాగేశారు. కాసేపు ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మద్దతు నిలిచిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
జగన్ మామయ్య! ఇచ్చిన మాట ప్రకారం మా అమ్మలకు జీతాలు పెంచండి- ఆరో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె
Anganwadi Centre Locks Are Broken In Guntur: గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని సుమారు 50 అంగన్వాడీ కేంద్రాల తాళాలను ఆదివారం రోజున అధికారులు బద్దలు కొట్టారు. ఒక పక్క ఇంటి యజమానులు మరో పక్క అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుపడినా పట్టించుకోలేదు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు లేకుండా తాళాలు ఎలా పగలగొడతారని వారు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పారు. పైనుంచి వచ్చిన ఆదేశాలను తాము పాటిస్తున్నామని ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. సచివాలయ సిబ్బంది దూకుడుగా వ్యవహరించడంపై అంగన్వాడీ కేంద్రాల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే తాము మరోసారి ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. అంగన్వాడీ సిబ్బందికి సీపీఎం నేతలు అండగా నిలిచారు.
అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడంపై ఆగ్రహం - పోలీసులు, సచివాలయ సిబ్బందిపై మండిపడుతున్న యజమానులు
Support Of Anganwadis Protest Children In Bapatla District: అంగన్వాడీలకు మద్దతుగా బాపట్ల జిల్లా చీరాలలో చిన్నారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమ టీచర్లకు, ఆయాలకు జీతాలు పెంచండి అంటూ నినాదాలు చేశారు. తమ టీచర్లు తమకు కావాలని... అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టొద్దని పలకల మీద రాసుకుని వచ్చి ప్రదర్శించారు. అంతే కాకుండా తమకు మంచి పాలు, ఆరోగ్యకరమైన పౌష్ఠికాహారం ఇవ్వాలని చిన్నారులు కోరారు. తహసీల్దార్ కార్యలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసన దీక్షలో పాల్గొన్నారు.