గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టు భూసేకరణ సమస్య కొలిక్కి రావటం లేదు. కొన్నిచోట్ల రైతులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. మరికొన్నిచోట్ల పరిహారం విషయంలో కర్షకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 2018 నవంబరులో అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గోదావరి నుంచి నీటిని కృష్ణానదికి మళ్లించి.. అక్కడినుంచి సాగర్ కుడికాల్వలోకి నీటిని ఎత్తిపోయడం ద్వారా 9లక్షల 61 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించింది.
నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించడం ఇందులో భాగమే. 2022 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎత్తిపోతల పథకానికి, కాల్వల నిర్మాణానికి 3,437 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. కాల్వలు నిర్మించే ప్రాంతంలో విలువైన భూములు ఉండటంతో రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. గుంటూరు జిల్లాలోని అమరావతి మండలంలో 974 ఎకరాలు, పెదకూరపాడు మండలంలో 127 ఎకరాలు, క్రోసూరు మండలంలో 665 ఎకరాలు, సత్తెనపల్లిలో 107 ఎకరాలు, రాజుపాలెంలో 844 ఎకరాలు, నకరికల్లు మండలంలో 628 ఎకరాలు సేకరించాల్సి ఉంది.
పరిహారం ఏపాటి?
ప్రాథమిక సమాచార సేకరణలో భాగంగా అధికారులు గ్రామసభలు పెట్టి రైతుల అభిప్రాయాలను, అభ్యంతరాలను తీసుకుంటున్నారు. బహిరంగ మార్కెట్ ధరలతో పోల్చి చూస్తే ప్రభుత్వం ఇచ్చే పరిహారం తక్కువగా ఉండటంతోపాటు కొన్ని ప్రాంతాల్లో అసలు భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదు. దీనివల్ల భూసేకరణ సర్వే ప్రక్రియకు తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో సర్వే చేయకుండా రైతులు అడ్డుకుంటున్నారు. విలువైన భూములు కోల్పోతే మళ్లీ కొనుక్కోవడానికి ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏమూలకు సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. సేకరిస్తున్న భూములకు ముందుగా ధర నిర్ణయించాకే పొలాల్లోకి అడుగుపెట్టాలని సర్వేకొచ్చిన రెవెన్యూ అధికారులను నిలదీస్తున్నారు.
మా భవిష్యత్తు ఏం కావాలి?
రాజధానికి భూములిచ్చిన ప్రాంతానికి సమీపంలోనే ఉన్న అమరావతి మండలం వైకుంఠపురంలో రైతులు తొలినుంచీ ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు భూములిస్తే తర్వాత తమ భవిష్యత్తు ఏమి కావాలని ప్రశ్నిస్తున్నారు. నకరికల్లులో ఇప్పటికే అద్దంకి-నార్కెట్పల్లి స్టేట్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి, నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేనిర్మాణం, నరసరావుపేట తాగునీటి పథకానికి రైతులు భూములిచ్చారు. ఇప్పుడు గోదావరి-పెన్నా అనుసంధానం ప్రాజెక్టుకు భూములివ్వడానికి అక్కడి రెతులు ఇష్టపడటం లేదు.
ముందుకు రావాలి
లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టు చేపడుతున్నప్పుడు విస్తృత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని రైతులు ముందుకు రావాలని గుంటూరు జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ కోరుతున్నారు. మెరుగైన పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామని... రైతులకు అభ్యంతరాలుంటే ఎల్.ఏ.ఆర్.ఆర్. అథారిటీ దృష్టికి తీసుకెళ్లవచ్చని సూచిస్తున్నారు. గోదావరి-పెన్నా ఆనుసంధాన ప్రాజెక్టు కీలకదశలో ఉన్న తరుణంలో పరిహారంపై రైతుల అభ్యంతరాలను జిల్లా యంత్రాంగం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనుంది. భూసేకరణలో అభ్యంతరమున్నచోట్ల పరిహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది.