Kanna Comments on Kapu Reservations : చంద్రబాబు కృషి, చొరవతోనే రాష్ట్రంలో కాపులకు గుర్తింపు, రిజర్వేషన్లకు తుదిరూపు వచ్చిందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కాపులకు రిజర్వేషన్ల డిమాండ్ సుదీర్ఘ కాలం నుంచి ఉందని.. తాను కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కాపు రిజర్వేషన్లకు సంబంధించి మొదట ఆలోచించింది కోట్ల విజయభాస్కరరెడ్డి అయితే... వాటికి తుదిరూపం తెచ్చింది మాత్రం చంద్రబాబు అని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
రాష్ట్రంలో కాపుల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు, కాపు రిజర్వేషన్ల అంశంపై ఆయన గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో 22 శాతం ఉన్న కాపులు మద్దతిచ్చిన వాళ్లే అధికారంలోకి రావటం 1989 నుంచి చూస్తున్నామన్నారు. అందుకే ఎన్నికల సమయంలోనే కాపులను వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాపులకు రిజర్వేషన్ల డిమాండ్ సుదీర్ఘ కాలం నుంచి ఉందని.. తాను కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు.
చంద్రబాబు హయాంలోనే కమిషన్..: కోట్ల విజయభాస్కరరెడ్డి దీనికి సంబంధించి జీవో ఇస్తే... వైఎస్ హయాంలో కమిషన్ వేశారని.. ఆ రిపోర్టు రాలేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా... కమిషన్ వేయటం, రిపోర్టు రావటం జరిగిందన్నారు. ఈబీసి కోటాలో రిజర్వేషన్ల ప్రక్రియను చంద్రబాబు పూర్తి చేశారని, ఇప్పటి ప్రభుత్వం దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పవన్‌కు ఆలోచించుకునే అవకాశం ఇవ్వాలి..: పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్న హరిరామజోగయ్య వ్యాఖ్యలపైనా కన్నా స్పందించారు. జనసేన పార్టీ పెట్టి 9 ఏళ్లయిందని, ఆయనకు కొన్ని సిద్దాంతాలున్నాయని.. కాబట్టి రాజకీయ నిర్ణయం పైనా పవన్ కల్యాణ్‌నే ఆలోచించుకునే అవకాశం ఇవ్వాలన్నారు. జీవీఎల్ ఏం సాధించారని కాపులతో సన్మానాలు చేస్తున్నారో అర్థం కావటం లేదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లకు చట్ట సవరణ చేసి రాష్ట్రాలకు అధికారం ఇచ్చిందని.. దాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో ఓబీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు ఇప్పించేందుకు చొరవ చూపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తన దృష్టిలో కాపుల సంక్షేమం కోసం కేంద్ర మాజీ మంత్రి పి.శివ శంకర్, కాపునాడు నేత మిరియాల వెంకట్రావు మాత్రమే చిత్తశుద్ధితో పని చేశారని వ్యాఖ్యానించారు.
రాజధాని విషయంలో కేంద్రం పార్లమెంటులో చేసిన ప్రకటనపై కన్నా లక్ష్మీ నారాయణ స్పందించారు. దోచుకోవడానికే సీఎం అక్కడ రాజధాని అని అంటున్నారని.. విశాఖ ప్రజలు రాజధాని అంటేనే వద్దని భయపడుతున్నారన్నారు.
అభివృద్ధి చెందిన విశాఖలో దోచుకోవటానికే ముఖ్యమంత్రి అక్కడ రాజధాని అంటున్నారు. అమరావతి విషయంలో కేంద్ర వైఖరిపై చాలామంది పలు రకాలుగా విమర్శలు చేశారు. అయితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు రాజధానులు కట్టడానికి నిధుల కోసం వెళ్తే.. అప్పుడు కేంద్రం సమాధానం చెబుతుందని తాను చెప్పానని... ఇప్పుడు అదే నిజమైంది. విశాఖ ప్రజలు రాజధాని అంటేనే వద్దని భయపడుతున్నారు. - కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు
ఇవీ చదవండి :