గుంటూరు జిల్లా మంగళగిరి ఎక్సైజ్ పోలీసులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రచ్చకెక్కారు. మంగళగిరి ఎక్సైజ్ పోలీస్స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ తనను అన్యాయంగా బదిలీ చేశారంటూ... సీఐ ప్రమీలారాణిపై విమర్శలు గుప్పించారు. తన భార్య గుండెజబ్బుతో బాధ పడుతుందని... ఈ సమయంలో తనను బదిలీ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
తనను మానసికంగా హింసిస్తున్నారని, తన చరవాణిని సైతం సీఐ లాక్కున్నారని కానిస్టేబుల్ కేబీఎన్ రెడ్డి ఆరోపించారు. మార్చి నుంచి సెలవు కావాలని అడిగితే... కొవిడ్-19 విధులు అప్పగించారని కానిస్టేబుల్ వాపోయారు. కానిస్టేబుల్ చరవాణిలో తన ఇళ్లు, కారు ఫొటోలున్నాయని సీఐ ప్రమీలారాణి వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం ఆ ఫొటోలను ఓ మీడియాకు ఇచ్చారన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్ను గుంటూరుకు బదిలీ చేశామన్నారు.