Farmers Worried about Crop Loss Due to Lack of Irrigation: ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులను సాగునీటి కష్టాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు సాగర్ కాలువ నుంచి సాగు నీరు విడుదల చేయకపోవడంతో అన్నదాతలు పంటను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మిరప పంట కాపు దశలో ఉండటంతో ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పొలాలకు పెడుతున్నారు. దీని వల్ల పెట్టుబడి పెరిగి.. లాభాల మాట అటు ఉంచితే.. అప్పుల పాలవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'అనంత' కరవు కష్టం! ఎండిన చెరువులు, అడుగంటిన బోర్లు - రైతుల కన్నీళ్లు పట్టని వైసీపీ పాలకులు
Lack of Irrigation in Guntur District: జిల్లాలోని రైతులు ఎన్నడూ చూడని తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు చూస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా పడకపోయినా.. సాగర్ జలాలు వస్తాయనే నమ్మకంతో పత్తి, మిరప, తదితర పంటలు వేశారు. ఒకవైపు పూర్తిగా ముఖం చాటేయడం, మరోవైపు పొలాలకు సాగునీరుపై దృష్టి పెట్టకపోవడంతో రైతులు ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. చేతికి వచ్చిన మిరప పంటను కాపాడుకునేందుకు భగీరథుడిని మించిన ప్రయత్నాలు చేస్తున్నారు. సాగు మీద ఉన్న మక్కువతో పంటలు కాపాడుకోవాలనే లక్ష్యంతో ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి.. పంటలు తడుపుకుంటున్నారు.
సాగునీరందక బీళ్లుగా మారుతున్న పొలాలు - రైతుల కంట ఉబుకుతున్న కన్నీళ్లు
AP Farmers Problems: ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి.. పంటలు తడపడం వల్ల ఎకరానికి 30 నుంచి 35 వేల రూపాయల వరకు అదనంగా ఖర్చు చేయాల్సివస్తుందని రైతులు వాపోతున్నారు. చేతిదాక వచ్చిన పంటను.. వదిలి పెట్టలేక అప్పులు చేసి మరీ పంటపై పెట్టుబడులు పెడుతున్నామని చెబుతున్నారు. సాగునీటి నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తమకు ఈ దుస్థితి ఎదురైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇంతలా ఇబ్బందులు పడుతున్నా ఏ ప్రజాప్రతినిధి, అధికారి కన్నెత్తయినా చూడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు సాగర్ కాలువ నుంచి సాగు నీరు విడుదల చేయకపోవడంతో పంటను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాం. చేతికందిన సాగును కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి.. పంటను తడుపుతున్నాం. ఇలా ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పంటలు తడపటం వల్ల ఎకరానికి 30 నుంచి 35వేల రూపాయల వరకు అదనంగా ఖర్చు అవుతోంది. ఇలా మూడుసార్లు పంటను తడపాలి. ఇంకో రెండు తడులు పెట్టాలంటే.. ఆ ఖర్చులు భరించటం మాకు చాలా కష్టంగా ఉంటుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మేము ఇలా అవస్థలు పడుతున్నాం. పంటను మేము రక్షించుకోవాలంటే వర్షాలైనా పడాలి.. అధికారులు సాగునీటినైనా అందించాలి.. లేకుంటే మా రైతులకు ఆత్మహత్యే శరణ్యం." - రైతన్నల ఆవేదన