రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసనల నేపథ్యంలో మందడంలో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. డీజీపీ రెండుసార్లు కోర్టుకు హాజరుకావాల్సి రావటం పోలీసులు వ్యవహరిస్తోన్న తీరుకు నిదర్శనమని వెలగపూడి రైతులు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల దుర్వినియోగం ఇకనైనా ఆపాలని హితవు పలికారు. జగన్‌కు తమ గోడు వినపడాలని రాయపూడి రైతులు జలదీక్ష చేపట్టారు. తుళ్లూరులో 77వ రోజు నిర్వహించిన మహాధర్నాలో మహిళలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలిపారు.
ఎమ్మెల్యే చింతమనేని గృహనిర్బంధం
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఛలో అమరావతికి పిలుపునిచారు. ఆయనతో కలిసి 200 కార్లతో పెద్ద ఎత్తున బయలుదేరేందుకు రైతులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అనుమతి లేదంటూ చింతమనేని ప్రభాకర్‌ను గృహానిర్బంధం చేసేందుకు యత్నించారు. అయితే ఆయన పోలీసులను తప్పించుకొని రాజధాని ప్రాంతానికి వచ్చి రైతులకు సంఘీభావం తెలిపారు.
గుంటూరులో ఆందోళనలు
గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రైతులు మానవహారం నిర్వహించారు. కృష్ణాయపాలెం, నవులూరు, నిడమర్రులో రైతులు, మహిళలు దీక్షలు చేపట్టారు. అమరావతిని కదిలించే శక్తి ప్రభుత్వానికి లేదని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద రాజధాని కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్ష 66వ రోజూ కొనసాగింది. మాజీమంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ రామకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం తెలిపారు.
అనంతపురం జిల్లాలో
అనంతపురం జిల్లా కదిరి మండలం కే.బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న చెర్లోపల్లి జలాశయంలో ఐకాస నాయకులు జలదీక్ష చేపట్టారు. రాష్ట్ర రాజధాని విషయంలో జగన్ సర్కార్ మొండి వైఖరి విడనాడాలని కోరుతూ ఏడు గంటల పాటు నీటిలో నిరాహార దీక్ష చేపట్టారు.
ఇదీ చూడండి: