Irrigation Water Problems: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు, కాకుమాను మండలాల్లో వేలాది ఎకరాలలో వరి పంట సాగు నీరు లేక ఎండిపోయే పరిస్థితికి చేరింది. కాల్వలో నీరు ప్రవహిస్తున్నా.. పొలాలకు సాగు నీరు అందడం లేదు. అప్పాపురం కాల్వ ప్రారంభంలోనే అధ్వానంగా మారింది. కాల్వలో నీరు సరఫరా అవుతున్నప్పటికీ.. చుక్క నీరు కూడా పొలాల్లోకి రావడం లేదు. ప్రధాన కాల్వ నుంచి వెళ్లే బ్రాంచ్ కాల్వలకు సాగు నీరు వెళ్లేందుకు వీలు లేకుండా నాచు, గుర్రపు డెక్క అడ్డుపడుతున్నాయి. కొందరు రైతులు ఇంజిన్లు పెట్టి పొలాలకు నీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
పంట చేతికి వచ్చే సమయంలో నీరు లేకపోతే.. పైరు నిలువునా ఎండిపోయే ప్రమాదం ఉందని కర్షకులు ఆవేదన చెందుతున్నారు. బ్రాంచ్ కాల్వలకు నీరు అందించాలని మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత స్వయంగా సమావేశం ఏర్పాటు చేసి చెప్పినా అధికారుల తీరులో మార్పు రాలేదు. గుర్రపు డెక్క తొలగించేందుకు నిధులు కూడా మంజూరు చేశారు. అయితే తూతూ మంత్రంగా పనులు చేశారని.. ఎలాంటి ఉపయోగం లేదని ఎమ్మెల్యే ఎదుటనే రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుర్రపు డెక్క తొలగించి.. సాగు నీరు అందించాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: