machine for tomato: ఒకసారి పంట నష్టపోతే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రోజులివి.. వచ్చిన దిగుబడికి ధర లభించకపోతే రవాణా ఖర్చులు భరించలేక రోడ్లపైన పారబోసే దుస్థితి.. నష్టాన్ని చవిచూసిన పంటను మరోసారి వేయకుండా ప్రత్యమ్నాయ సాగుకు మొగ్గుచూపే పరిస్థితి.. ఇలాంటి సమయంలోనూ పంట పండించడంలోని సమస్యల నుంచి విముక్తి పొందాలని ఆలోచించాడు వేజెండ్ల గ్రామానికి చెందిన రైతు హరికృష్ణ. అందుకే తానే స్వయంగా యంత్రాన్ని తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు..
machine for tomato: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన గవిని హరికృష్ణ పదో తరగతి చదివాడు. 20ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. టమాటా పండించే హరికృష్ణకు తరచూ గ్రేడింగ్, మార్కెటింగ్ విషయంలో సమస్యలు ఎదురయ్యేవి. ఎంత మంచి పంట మార్కెట్‌కు తీసుకెళ్లినా.. అక్కడక్కడా ఉన్న చిన్న కాయలను చూపి వ్యాపారులు ధర తగ్గించేవారు. కూలీలతో గ్రేడింగ్ చేయించి తీసుకెళ్లినా.. ఒక్కో డబ్బాకు రెండు, మూడు కిలోలు తగ్గించి డబ్బులిచ్చేవారు. తాను నష్టపోతున్నానని తెలిసినా హరికృష్ణకు వేరే మార్గం లేక సతమతమయ్యేవాడు.
అంత ధర పెట్టలేక తానే సొంతంగా
machine for tomato: రెండేళ్ల క్రితం హరికృష్ణ ఉద్యానశాఖ అధికారులతో కలిసి బెంగళూరు వెళ్లినప్పుడు అక్కడ ఓ పెద్ద మాల్ నిర్వాహకులు టమాటాలను యంత్రంతో గ్రేడింగ్ చేయటం చూశాడు. పెద్దకాయలకు అధిక ధర వస్తున్న విషయం గమనించారు. మార్కెట్లో అలాంటి యంత్రం ధర రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఉంది. అంత ధర పెట్టలేక.. యూట్యూబ్ వీడియోలు చూసి తానే సొంతంగా యంత్రాన్ని తయారు చేయడం ప్రారంభించాడు. మొదట్లో చిన్నచిన్న పొరపాట్లు చేసినా చివరకు అనుకున్నది సాధించాడు.
అధిక లాభం
machine for tomato cultivation: ఈ యంత్రం తుప్పు పట్టకుండా ఉండేందుకు జింక్ ఫ్రేములు, స్టీల్ కడ్డీలు, రేకులు వాడారు. చక్రాలు అమర్చటం ద్వారా సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. రోజుకు 200 పెట్టెల టమాటాలు గ్రేడింగ్ చేయొచ్చు. ఇదే పని కూలీలతో చేయిస్తే రూ.2వేలు ఖర్చవుతుంది. యంత్రం సాయంతో రూ.500 లతోనే గ్రేడింగ్ పూర్తవుతోంది. పెద్ద కాయలకు మార్కెట్లో అదనపు ధర లభిస్తుంది. మెషిన్ గ్రేడింగ్ కాయలంటే వ్యాపారులు మారుమాట్లాడకుండా కొంటున్నారు.
నేను రూపొందించిన యంత్రం ద్వారా టమాటాల గ్రేడింగ్ చాలా సులువైంది. యంత్రం తయారీకి రూ.50వేలు ఖర్చయింది. ఏడాదిలోనే యంత్రం కారణంగా లక్ష రూపాయలు లాభం వచ్చింది. ఇప్పుడు రూ.30 వేలతోనే ఎవరైనా ఈ యంత్రాన్ని చేయించుకోవచ్చు. తోటి రైతులు కూడా హరికృష్ణ తోట వద్దకు టమాటాలు తెచ్చి గ్రేడింగ్ చేసుకుని వెళ్తున్నారు. 5నుంచి 10 ఎకరాల్లో టమాటా సాగు చేసే రైతులకు ఈ యంత్రం చాలా ఉపయోగపడుతుంది. - గవిని హరికృష్ణ, రైతు
ఇదీ చదవండి: అన్నదాతలు అప్డేటయ్యారు.. మిర్చి పంటను కాపాడుకునేందుకు...ఆ ఏర్పాట్లు..