గుంటూరు జిల్లా కొండవీడు కోట ఉత్సవాల్లో కోటయ్య అనే రైతు అనుమానాస్పద మృతి వివాదానికి దారితీసింది. పోలీసులు కొట్టడం వల్లే కోటయ్య మృతి చెందారని కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా.... పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నందున.. సమగ్ర విచారణకు పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది.
అసలు జరిగింది ఏంటి ?
చారిత్రక ప్రాధాన్యం ఉన్న గుంటూరు జిల్లా కొండవీడు కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17,18 తేదిల్లో ఉత్సవాలు నిర్వహించింది. రెండో రోజు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. సీఎం బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు సభా వేదిక సమీపంలో ఖాళీగా ఉన్న పొలంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. దీనికోసం రైతు కోటయ్య నుంచి అనుమతి తీసుకున్నారు. దాని పక్కనే కోటయ్యకు చెందిన బొప్పాయి, కనకాంబరం తోటలు కూడా ఉన్నాయి. ఉత్సవాల చివరి రోజు పొలంలో కోటయ్య అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని ఆయన ఇంట్లో పనిచేసే పాలేరు గుర్తించాడు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే కోటయ్య మరణించాడు. పంటను నాశనం చేశారని ప్రశ్నిస్తే పోలీసులు కొట్టారని... దాని వల్లే కోటయ్య మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.
రూ.5 లక్షల పరిహారం ప్రకటన
కొండవీడు ఉత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రికి ఈ విషయం సభ చివర్లో తెలిసింది. వెంటనే రైతు కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం ప్రకటించారు. ఈ వ్యవహారంలో పోలీసులతో పాటు ముఖ్యమంత్రి కారణమేమనని వైకాపా నేతలు విమర్శిస్తున్నారు. రైతు మృతికి చంద్రబాబే కారణమని ప్రతిపక్షనేత జగన్ ట్వీట్ చేశారు.
విచారణకు ఆదేశం
ముఖ్యమంత్రి హెలిప్యాడ్ కోసం రైతు పొలాన్ని పాడు చేశారని... అడ్డుకున్న రైతుని పోలీసులు కొట్టడం వల్ల చనిపోయాడని ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు పోలీసు ఉన్నతాధికారులూ అప్రమత్తమయ్యారు. జరిగిన ఘటనపై విచారణ జరపాలని ఆదేశించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ విషయంలో వెంటనే స్పందించి కోటయ్య కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. విచారణ జరిపించి వాస్తవాలు వెల్లడిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
బుధవారం నివేదిక
కోటయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు తొలుత అంగీకరించక పోయినప్పటికీ.... నచ్చజెప్పి శవపరీక్ష నిర్వహించారు. అందుకు సంబంధించిన నివేదిక బుధవారం అందనుంది. అప్పుడే కోటయ్య మృతికి కారణాలు వెల్లడయ్యే అవకాశముంది.