Fake Votes in AP: "మన ఓట్లు అనుకునేవే జాబితాలో ఉండాలి. మనవి కానివి తీసేయించాలి" అని రాష్ట్రమంత్రి సీదిరి అప్పలరాజు, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆధారాలతో బయటపడి నెలలు గడుస్తున్నా.. వారిపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదు? సమగ్ర విచారణకు ఎందుకు ఆదేశించలేదు? అర్హుల ఓట్లు గల్లంతు చేయాలనే కుట్ర తిరుగులేని ఆధారాలతో వెల్లడైనా వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోలేదు? కనీసం ఒక్క నోటీసైనా ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నలు ఈసీని వెలెత్తి చూపిస్తున్నాయి.
Bogus Votes in AP: అలాగే పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో ఫారం-7 దరఖాస్తులు పెట్టిన వైసీపీ నాయకులపై టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఫిర్యాదులిచ్చినా ఎందుకు పట్టించుకోలేదు? చివరికి ఆయన హైకోర్టును ఆశ్రయిస్తే తప్ప బాధ్యులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు? విశాఖపట్నం తూర్పులో 40 వేల ఓట్లు తీసేశారంటూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఫిర్యాదుపై పట్టించుకోకపోవటం వల్లే.. ఆయన హైకోర్టు వరకూ వెళ్లాల్సి వచ్చింది.
Fake Votes Hulchal in AP: ఉరవకొండలో ఓట్ల తొలగింపుపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. దిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌కు ఫిర్యాదిస్తే తప్ప ఆ అక్రమాలపై ఎందుకు కదల్లేదు?. ఈ ప్రశ్నలకు ఈసీ నుంచి సమాధానాలు చెప్పగలదా. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు బూత్ స్థాయి అధికారులుగా ఉండేవారు. వారి బదులు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల సంఘం బీఎల్‌వోలుగా నియమించింది. వారంతా వైసీపీ హయాంలో నియమితులైనవారు కావడంతో.. ఓటర్ల జాబితాలన్నీ వైసీపీకి అనుకూలంగా రూపొందేలా మంత్రులు, ఎమ్మెల్యేలు వారిపై ఒత్తిళ్లు తెస్తున్నారు.
ఓ వైపు ఇలాంటి కుట్రలన్నీ అమలుచేస్తూ.. మరోవైపు అందరి దృష్టి మళ్లించేలా ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తూ ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. రాష్ట్రంలో జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా ఓటర్లు పెరగలేదని, నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, వీటిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఎమ్మెల్యే పేర్ని నాని నెల రోజుల కిందట ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు. "2019 ఎన్నికలకు ముందు టీడీపీ 60 లక్షల ఓట్లు చేర్పించిందని.. ఇప్పుడు ఆచూకీ లభించనివారి ఓట్లు, నకిలీ ఓట్లు అన్నీ అవేనని.. మరణ ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా బీఎల్‌వోలు గుర్తించిన ఓట్లు తొలగించాలి" అంటూ ఇటీవలే అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదుచేశారు.
రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా వైసీపీ అధికారంలో ఉంది. నిజంగా టీడీపీ నకిలీ ఓట్లు చేర్పించుంటే.. ఇన్నాళ్లుగా వాటిని ఉంచుతారా? ఒక్క నియోజకవర్గంలోనైనా రుజువులు ఎందుకు చూపించలేకపోయారు. ప్రతిపక్షాల ఓట్లు తొలగించే ఎత్తుగడలో భాగంగానే ఇలాంటి ఫిర్యాదులు చేస్తుండటం వాస్తవం కాదా? కాదని ఈసీ చెప్పగలదా..? ప్రతిపక్షాల ఓట్ల తొలగింపు కోసం తప్పుడు వివరాలు, సమాచారంతో ఫారం-7 దరఖాస్తులు పెట్టినవారిపై పర్చూరు నియోజకవర్గం మినహా మిగతాచోట్ల ఎక్కడా ఎందుకు కేసులు పెట్టలేదు?.
బతికున్న వారు సైతం చనిపోయారంటూ తప్పుడు సమాచారంతో ఓట్ల తొలగింపు దరఖాస్తులు పెడుతున్న వారిని ఎందుకు గుర్తించట్లేదు? ఫలానా వ్యక్తుల ఓట్లు తొలగించాలని ఇంకెవరో దరఖాస్తులు చేయటం ఏంటి? వాటి ఆధారంగా వారి ఓట్లు తీసేయటమేంటి? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం కాదా? ఈ నేరం ఎన్నికల సంఘానిది కాదా? ఇలా అయితే ఓటర్ల జాబితాను నమ్మేదెలా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఓటరు నమోదు, తొలగింపు, ఓటుకు ఆధార్ అనుసంధానంతో పాటు ఇంటింటి సర్వేలోనూ వాలంటీర్లు పాల్గొన్నా ఒకరిద్దరిపై మినహా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్ల తొలగింపు, అధికారపార్టీకి అనుకూలంగా నకిలీ ఓట్ల చేర్పింపులో.. చాలాచోట్ల బూత్‌స్థాయి అధికారులతో కలిసి కొందరు వాలంటీర్లే క్రియాశీలకంగా వ్యవహరించారు. వారిపై ఫిర్యాదులు అందినప్పుడే ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించి ఉండుంటే.. ఇప్పుడు ఓటర్ల జాబితాలో అవకతవకలకు ఆస్కారమే ఉండేది కాదు.
ఓటర్ల జాబితాలో అవకతవకలపై ప్రతిపక్షాలు ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా ఎన్నికల సంఘం 2022 జనవరి 6 తర్వాత తొలగించిన ఓట్ల పునఃపరిశీలనకే పరిమితమైంది. కొత్తగా చేర్చిన నకిలీ ఓట్ల ఊసే ఎత్తలేదు. ఇలా అధికార పార్టీ అక్రమాల పట్ల చూసీచూడనట్లు వ్యవహరించటం, ప్రతిపక్షాల ఫిర్యాదులను బుట్టదాఖలు చేయటం వల్ల రాష్ట్రంలో ఓటర్ల జాబితాపై ప్రజల్లో నమ్మకం లేకుండా పోయింది. జాబితాలో ఈ రోజు పేరున్నా.. రేపటికి ఉంటుందో లేదోనన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది.
వైసీపీ వారి ఓట్లయితేనే జాబితాలో ఉంచుతారా? వారివి కాని ఓట్లు గల్లంతు చేసేస్తారా? వీటిపై ప్రతిపక్షాలు పదే పదే ఫిర్యాదులు చేసినా పట్టించుకోరా? హైకోర్టును ఆశ్రయిస్తే తప్ప బాధ్యులపై కేసులు నమోదు చేయరా? ఓటర్ల జాబితా మొత్తం వైసీపీకి అనుకూలంగా రూపొందితే.. ఇక ప్రజాస్వామ్యం ఎందుకు? ఎన్నికలు ఎందుకు? ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా అక్రమాలు, లోపాలమయంగా మారిపోవడానికి ఎన్నికల సంఘం వైఫల్యం, నిర్లక్ష్యమే కారణం కాదా?.
Voters List Without Correction of Irregularities: ఈ అక్రమాలు పూర్తిగా సరిదిద్దకుండా మరో వారం రోజుల్లో ముసాయిదా జాబితా విడుదలకు సిద్ధమవుతుండటం ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయటం కాదా? అధికార పార్టీకి కావాల్సినవారి ఓట్లు మాత్రమే ఉంచి, మిగతావి జాబితాలో నుంచి తీసేస్తే ఇక ఓటర్ల జాబితాకు అర్థమేముంటుంది. ఈ ప్రశ్నలకు ఈసీ సమాధానం చెప్పగలదా..?