తమ సమస్యలను పరిష్కరించాలని గుంటూరు జిల్లా ఫ్యాప్టో ఆధ్వర్యంలో రెండో రోజు కలెక్టరేట్ ఎదుట నిరసన కొనసాగించారు. వర్షంలోనే రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇటీవలే ప్రభుత్వం.. ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్ కోసం జీవోలు విడుదల చేసిందని.. రెండు జీవోల్లో ఫ్యాప్టో ప్రతిపాదించిన ముఖ్య అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. అందులోని నియమ, నిబంధనలు మార్చకపోతే తాము నష్టపోవడం ఖాయమని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు.
- ఖాళీలు చూపాలి..
2019 జూన్ నుంచి పదోన్నతులు అప్‌గ్రేడేషన్ ద్వారా నింపిన అన్నింటిని ఖాళీలుగా చూపాలని డిమాండ్ చేశారు. సర్వీస్ పాయింట్లన్నీ ఒకే విధంగా ఉండాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులకు దీర్ఘకాలిక బదిలీలను ఐదు సంవత్సరాలు పూర్తిగా ఉండాలని కోరారు. రేషనలైజేషన్ విధానంలో 1:30 విధానాన్ని తొలగించాలనన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల సమాఖ్యతో చర్చలు జరపాలని జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ బసవలింగారావు డిమాండ్ చేశారు.