Plight of contract workers IN AP: నేను విన్నాను.. నేను ఉన్నానని.. పాదయాత్రలో అడుగడుగునా కాంట్రాక్టు ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కొలువులన్నీ క్రమబద్దీకరిస్తామంటూ మైకుల్లో ఊదరగొట్టారు. సీఎం హోదాలో అదే మాట చెప్పడంతో ...అంతా ఉప్పొంగిపోయారు. ఇక తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంతగానో ఆశించారు. కాలం గడిచింది. ఏళ్లు గడిచాయి. కమిటీలంటూ కాలయాపనే తప్ప.. హామీ అమలులో మాత్రం అడుగు పడలేదు. ఒక్క ఉద్యోగి సర్వీసునూ క్రమబద్దీకరించలేదు. ఇచ్చిన మాట.. నీటి మూటగానే మిగిలింది. తమ కష్టాలు తీర్చాలని లక్షలాది ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ.... తిరుగుతూనే ఉన్నారు. తమ కష్టాలు తీర్చాలని వేడుకుంటే.. వేతనాలు పెంచడం మాటేమోగానీ.. కోతలు పెట్టి మరిన్ని కష్టాలపాలు చేశారు.
విన్నారుగా.. ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర పొడవునా జగనన్న హామీ ఇది. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోనూ చెప్పారు. గత ఎన్నికల ప్రచార సభల్లోనూ పలుచోట్ల ఊదరగొట్టారు. మన ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగి కనిపించడని..సమానపనికి సమాన వేతనం ఇస్తామని నమ్మించారు. ఈ మాటలు నిజమవుతాయని కాంట్రాక్ట్ ఉద్యోగులు నమ్మారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక..మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతానని మరోసారి స్పష్టం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి హోదాలో జూన్ 8న తొలిసారి సచివాలయానికి వచ్చిన సీఎం వైఎస్ జగన్ మరోసారి కాంట్రాక్టు ఉద్యోగులకు వరాల మూట ప్రకటించారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేస్తామన్నారు.
ఇవీ చదవండి: