ETV Bharat Eenadu Voter Enrollment Program: దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాల్సిన యువతీ, యువకులు 18 ఏళ్లు నిండినా ఓటు నమోదు చేసుకోకపోవడంతో ఎన్నికల పండగలో భాగస్వాములు కాలేకపోతున్నారు. వారిలో చైతన్యం నింపేందుకు ఈటీవీ భారత్ - ఈనాడు నడుం బిగించాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో ఓటు నమోదు, చైతన్యంపై సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాయి.
పెద్ద ఎత్తున యువత : ఓటు హక్కు నమోదు, ఓటరు చైతన్యంపై ఈటీవీ భారత్ - ఈనాడు నిర్వహిస్తున్న అహగాహన కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. కడప రామిరెడ్డి ఫార్మసీ కళాశాలలో ఓటరు చైతన్యంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కడప తహశీల్దార్ సూచించారు.
'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ఓటరు నమోదు అవగాహన సదస్సు కార్యక్రమం
ఓటును ఏ విధంగా నమోదు చేసుకోవాలి, ఒక చోట నుంచి మరొక చోటుకు ఎలా మార్చుకోవాలనే అంశాన్ని విద్యార్థులకు వివరించారు. అంతేకాకుండా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్దతుల్లో ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలనే విషయాన్ని క్షుణ్ణంగా విద్యార్థులకు తెలిపారు. ఏ అవసరం కోసం ఏయే దరఖాస్తులు చేసుకోవాలనే అంశాలను వివరించారు. కొందరు స్మార్ట్ ఫోన్ల ద్వారా అక్కడికక్కడే ఓటు నమోదు చేసుకున్నారు.
"ఇంతవరకు మాకు తెలియని విషయాలను ఇప్పుడు తెలుసుకున్నాము. ఓటు హక్కు నమోదు చేసుకున్నాము. ఈ సదస్సును ఏర్పాటు చేసినందుకు ఈటీవీ భారత్ - ఈనాడుకు ధన్యవాదాలు." - విద్యార్థిని
ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో విశాఖలో ఓటరు నమోదుపై అవగాహనా కార్యక్రమాలు
ఓటరు నమోదుకు యువత ఉత్సాహం : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పద్మావతి డిగ్రీ కళాశాలలో ఓటు నమోదుపై బీఎల్వోలు అవగాహన కల్పించారు. స్మార్ట్ ఫోన్‌లో ఏ విధంగా ఓటు నమోదు చేసుకోవాలో తెలిపారు. ఓటర్లుగా చేరేందుకు యువత ఉత్సాహం కనబరిచారు.
మేము ఓటు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. మా ఓటును మేమే నమోదు చేసుకున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ టీవీ భారత్ - ఈనాడుకు ధన్యవాదాలు." - విద్యార్థిని
ఓటరు నమోదు అవగాహన కార్యక్రమాల్లో బీఎల్వోలకు వసతుల కొరత - ప్రజలకు తప్పని అవస్థలు
రాజమహేంద్రవరంలోని బొమ్మూరు డైట్ కళాశాలలో ఈటీవీ భారత్ - ఈనాడు నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. యువత సమాజ పోకడలను పరిశీలించి సరైన నాయకుడ్ని ఎన్నుకోవాలని వక్తలు సూచించారు. ఓటు నమోదుతో పాటు, ఓటు హక్కును వినియోగించడంలోనూ ఆసక్తి కనబరచాలని కోరారు. ఓటు వేయడం బాధ్యతగా భావిస్తామన్న విద్యార్థులు ఓటు వేసి తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకుంటామని తెలిపారు.
భవితను మార్చేది ఓటే: అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఓటు నమోదు, చైతన్యంపై అవగాహన కల్పించారు. చరిత్ర గతిని, భవితను మార్చేది ఓటు మాత్రమే అని వక్తలు అన్నారు. ఓటు నమోదుపై విద్యార్థులకు ఉన్న సందేహాలను తీర్చారు. ఓటు నమోదుపై ఈటీవీ భారత్ - ఈనాడు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు ఎంతో ఉపయోగపడిందని, ఓటు ప్రాధాన్యతను తెలియజేసిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.