EPFO Issues Circular on Higher Pension: యాజమాన్యం, ప్రభుత్వం తీరుతో.. ఆర్టీసీ ఉద్యోగులు అధిక పింఛన్‌ను కోల్పోయే పరిస్థితి తలెత్తింది. వారికి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా జగన్ సర్కారు, ఆర్టీసీ యాజమాన్యం చోద్యం చూస్తున్నాయి. ఆర్థిక సమస్యలతో చిక్కుకున్న పలువురు ఉద్యోగులు.. గడువులోగా అధిక పింఛన్ కోసం నగదు చెల్లించలేకపోతున్నారు. బకాయిలను వెంటనే విడుదల చేస్తే.. అధిక పింఛన్ ఖాతాలో జమచేస్తామని ఉద్యోగులు కోరుతున్నారు. అయినా పట్టించుకునే నాథుడే లేడు. ఓ వైపు గడువు సమీపిస్తుండటం.. బకాయిల విడుదలపై ప్రభుత్వంలో కనీస చలనం లేకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ప్రభుత్వంలో విలీనం తర్వాత ఇప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులకు ఏ పింఛను ఇస్తారనేది ప్రభుత్వం తేల్చలేదు. దీంతో ఆ ఉద్యోగులు ఈపీఎఫ్ అధిక పింఛన్ కోసం కొంతకాలం కిందట ఆప్షన్ ఇచ్చారు. ఇపుడు వరుసగా మూడు, నాలుగు నెలలుగా ఉద్యోగులకు పీఎఫ్ ట్రస్ట్ కార్యాలయం నుంచి నోటీసులు వస్తున్నాయి. అందులో ఉద్యోగుల వాటా కింద ఎంత చెల్లించాలో స్పష్టం చేస్తున్నారు. ఆ మేరకు వారి పీఎఫ్ ఖాతాల్లో సొమ్ము ఉండాలని, అలాగే దీనికి సమ్మతం తెలుపుతూ లేఖ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఉద్యోగులు చాలామంది గతంలో తమ కుటుంబ అవసరాల కోసం పీఎఫ్ ఖాతాలో సొమ్మును దాదాపు వాడేసుకున్నారు. ఇపుడు వారి ఖాతాల్లో హయ్యర్ పింఛనుకు అవసరమైన సొమ్ము లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత నెలాఖరులోపు సమ్మతి తెలపాలంటూ పీఎఫ్ ట్రస్ట్ నుంచి నోటీసులు వచ్చిన ఉద్యోగుల్లో దాదాపు 500 మంది పీఎఫ్ ఖాతాల్లో సొమ్ములేక.. సమ్మతి లేఖలు ఇవ్వలేకపోయారు. దీంతో వీరు అధిక పింఛను పొందే అవకాశం కోల్పోయినట్లయింది. తాజాగా ఈ నెలాఖరులోపు కూడా సమ్మతి తెలపాలంటూ 2,940 మందికి నోటీసులు వచ్చాయి. వీరిలో కూడా సగం మందికి వారి ఖాతాల్లో అవసరమైన డబ్బులేక సమ్మతి లేఖలు ఇచ్చే పరిస్థితి నెలకొంది.
"బకాయిలను నత్తనడకన చెల్లిస్తూ వస్తూంటే.. పూర్తయ్యే సరికి పదేళ్లు పడుతుంది. అధిక పింఛన్ పేరుతో.. ఒక్కొక్కరికి 4 లక్షలు, 5 లక్షలు 10 లక్షలు కట్టాలని నోటీసులు వస్తున్నాయి. ఫీఎఫ్లో అధిక పింఛన్ కోసం మేము ఇన్ని లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి." -జిలానీ బాష, ఎస్‌డబ్ల్యూఎఫ్ గౌరవ అధ్యక్షుడు
ఉద్యోగులు గతంలో ఆర్టీసీలో ఉన్నపుడు 2017లో వేతన సవరణ చేయగా.. ఇప్పటికీ ఆ బకాయిలు అందరికీ ఇవ్వలేదు. ముందుగా పదవీ విరమణ చెందేవారికి మాత్రమే ఇస్తున్నారు. ఇంకా 550 కోట్ల మేర వేతన సవరణ బకాయిలు చెల్లించాల్సి ఉంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఉద్యోగులు ఒకొక్కరికీ 45 రోజుల ఆర్జిత సెలవు సొమ్ము చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం దాదాపు 300 కోట్ల వరకు ఉంది. దీనిపై సర్కారు ఉలుకుపలుకూ లేకుండా ఉంది.
ఈ రెండు బకాయిలు ఇస్తే, వాటిని పీఎఫ్ ఖాతాలో జమ చేసుకొని అధిక పింఛనుకు సమ్మతం తెలుపుతామని ఉద్యోగులు వేడుకుంటున్నారు. ఆర్టీసీ యాజమాన్యం బ్యాంకు రుణం తీసుకొని, ఉద్యోగుల వేతన సవరణ బకాయిలు చెల్లించేలా చూడాలని ఇటీవల రవాణాశాఖ మంత్రి అధికారులకు సూచించారు. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.
How to Apply TSRTC Student Bus Pass : ఆన్లైన్లో బస్‌పాస్.. ఇంటి నుంచే పొందండిలా..!
"2020లో ప్రభుత్వంలో విలీనమైన దగ్గర్నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. విలీనమైనప్పటి నుంచి అదనంగా ఒక్క రూపాయి లేదు. అంతేకాకుండా అలవెన్సులన్నీ ఆగిపోయాయి. జీతం తప్ప వేరే వచ్చేదేమీ లేదు." -శేషగిరిరావు, ఆర్టీసీ కార్మిక పరిషత్ అధ్యక్షుడు
ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి వెంటనే ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని.. లేని పక్షంలో తమకు రావాల్సిన అధిక పింఛన్ అవకాశాన్ని కోల్పోతామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.