Electricity Charges Increased After YCP Came to Power: జగన్ పదవీకాలం ఐదేళ్లు అది పూర్తికాకుండానే ఐదుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. సరాసరిన ఏడాదికి ఒకసారి బాదుడుతో సామాన్యుల నడ్డివిరిచారు. అధికారంలోకి వస్తే పేదలపై కరెంటు ఛార్జీల భారం లేకుండా చేస్తానని పాదయాత్రలో నమ్మబలికిన జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాదీ ఊపిరి సలపనివ్వలేదు. బాదుడే బాడుడు అంటూ గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించిన జగన్ ఇప్పుడు వీరబాదుడు బాదుతున్నారు శ్లాబ్‌లు, టారిఫ్ మార్చి వందల కోట్ల భారం పేదలపై మోపారు.
జగనన్న వీర బాదుడు మామూలుగా లేదుగా - సామాన్యుడి గుండె గుభేల్!
2021 ఏప్రిల్ నుంచి గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి కనీస వినియోగ ఛార్జీలకు బదులుగా కాంట్రాక్ట్ లోడ్‌పై స్థిర ఛార్జీల కింద కిలోవాట్‌కు 10 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. సింగిల్ ఫేజ్ కనెక్షన్ తీసుకునే వినియోగదారుడు కనీసం 3 కిలో వాట్ లోడ్ తీసుకుంటే ప్రతి నెలా స్థిర ఛార్జీల కింద నెలకు 30 రూపాయలు బిల్లులో కలిపి వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి స్థిర ఛార్జీల కింద 360 రూపాయలు చెల్లించాల్సిందే. ఇక త్రీఫేజ్ విద్యుత్ కనెక్షన్ తీసుకుంటే కాంట్రాక్ట్ లోడ్ కనీసం 5 కిలోవాట్లుగా ఉంటుంది.
పాత విధానంలో సింగిల్ ఫేజ్ కనెక్షన్లకు 65 రూపాయలు, త్రీఫేజ్ కనెక్షన్లకు 150 వంతున కనీస డిమాండ్ ఛార్జీల కింద డిస్కంలు వసూలు చేసేవి. ఈ మొత్తం కంటే విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్న నెలలో మాత్రమే కనీస విద్యుత్ ఛార్జీల భారాన్ని వినియోగదారులు భరించాల్సి వచ్చేది. కొత్త నిబంధన ప్రకారం విద్యుత్ వినియోగంతో సంబంధం లేకుండా ప్రతినెలా స్థిర ఛార్జీల పేరుతో డిస్కంలు వసూలు చేస్తున్నాయి.
స్పిన్నింగ్ మిల్లులు మూతపడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం - వేలాది మంది ఉపాధికి గండి
Electricity Charges Increased 5 Times Under YCP Govt:
- వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదలు పెట్టిన మొదటి బాదుడు ఇదే. స్థిర ఛార్జీల కింద 2024 మార్చి వరకూ 580 కోట్లు దండుకుంది.
- 2014-19 సంవత్సరాల మధ్య 5 ఏళ్లలో వినియోగించిన విద్యుత్‌కు ట్రూఅప్ ఛార్జీల కింద 2 వేల 910 కోట్లు 36 నెలల్లో వసూలు చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటికే 50 శాతాన్ని డిస్కంలు ప్రతినెలా బిల్లులో కలిపి వసూలు చేసేశాయి. యూనిట్‌కు 22 పైసల వంతున భారం వేస్తోంది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో గృహ విద్యుత్ కనెక్షన్లపై వినియోగించే విద్యుత్ 30 శాతం ఉంటుంది. ఈ లెక్కన కోటి 52లక్షల గృహ విద్యుత్ వినియోగదారులపై 873 కోట్ల భారం పడింది. అందులో రూ.436 కోట్లు ఇప్పటికే ప్రతి నెలా బిల్లులో కలిపి డిస్కంలు వసూలు చేశాయి.
- 2021-22లో వినియోగించిన విద్యుత్‌కు ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద 3వేల82కోట్ల రూపాయలను 2023 ఏప్రిల్ నుంచి 12 వాయిదాల్లో వసూలు చేసుకోడానికి డిస్కంలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ లెక్కన గృహ విద్యుత్ వినియోగదారులపై 924 కోట్ల రూపాయల భారం పడింది. అందులో గతేడాది ఏప్రిల్ నుంచి 9 నెలల్లో 693 కోట్లు వసూలు చేసేసింది.
- 2024 ఏప్రిల్ నుంచి ప్రతి నెలా విద్యుత్ కొనుగోలుకు అదనంగా చేసే ఖర్చులో యూనిట్‌కు గరిష్ఠంగా 40 పైసల వంతున ఆ తర్వాతి నెల బిల్లులో కలిపి వసూలు చేసుకోడానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణా మండలి అనుమతిచ్చింది. ప్రతి నెలా విద్యుత్ డిమాండ్ సగటున 200 మిలియన్ యూనిట్లు అనుకుంటే అందులో 30 శాతం గృహ విద్యుత్ వినియోగంగా ఉంటుంది. నెలకు 180 కోట్ల యూనిట్లు వినియోగం ఉంటుంది. ఈ లెక్కన నెలకు 72 కోట్ల రూపాయల చొప్పున ఏడాదిలో పడే భారం 864 కోట్లు. గతేడాది ఏప్రిల్ నుంచి నవంబరు వరకూ 576 కోట్ల రూపాయలను డిస్కంలు ప్రతి నెలా బిల్లులో కలిపి వసూలు చేశాయి.
- 2022 ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్న టారిఫ్ ప్రకారం శ్లాబ్‌లు, యూనిట్ రేట్లను పెంచడం ద్వారా గృహ విద్యుత్ వినియోగదారులపై ఏటా రూ.1,400 కోట్ల భారాన్ని ప్రభుత్వం వేసింది. నెలకు రూ.116 కోట్ల రూపాయల వంతున 21 నెలల్లో 2వేల 450 కోట్ల ఛార్జీల భారాన్ని వేసింది.
జీన్స్ పరిశ్రమలపై విద్యుత్ ఛార్జీల బాదుడు - రాయితీలకూ నోచక మూతపడుతున్న పరిస్థితి