Dr Gokhale Letter To Health Department : గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో గుండె శస్త్రచికిత్సల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. గతంలో జీజీహెచ్‌లో ఎన్నో శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించిన ప్రముఖ వైద్యనిపుణుడు గోపాలకృష్ణ గోఖలే శస్త్రచికిత్సలు చేయలేమని వైద్యారోగ్య శాఖ అధికారులకు లేఖ రాశారు. ఇక్కడ ఆపరేషన్లు నిర్వహిస్తామని ముందుకొచ్చిన గోఖలే బృందానికి జీజీహెచ్ అధికారుల నుంచి సహకారం కొరవడినందునే గోఖలే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా పేద రోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
దేశంలోనే ప్రఖ్యాత గుండె వైద్య శస్త్రచికిత్సల వైద్య నిపుణుడిగా పేరొందిన డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో 500 గుండె శస్త్రచికిత్సలు, 5 గుండె మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. కరోనా తర్వాత వచ్చిన గ్యాప్ వల్ల జీజీహెచ్‌లో కొన్నేళ్లుగా గుండె ఆపరేషన్లు నిలిచిపోయాయి. మరోవైపు గోఖలేతో ఒప్పందాన్ని ప్రభుత్వం పునరుద్దరించకపోవడంతో మూడేళ్లుగా ఆపరేషన్లు నిలిచిపోయాయి. పేద రోగులు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి చూపించుకోలేక అల్లాడుతున్నారు.
గోఖలే లేకుండా జీజీహెచ్ వైద్యులు గతంలో జరిపిన ఓ ఆపరేషన్ విఫలమై రోగి చనిపోయారు. మళ్లీ గోఖలే వస్తేనే ఆపరేషన్లు విజయవంతంగా జరుగుతాయని రోగులు, వారి బంధువులు భావిస్తున్నారు. గోఖలేను తిరిగి రప్పించేందుకు జీజీహెచ్ అధికారులు, వైద్యులు ఆసక్తి చూపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్‌లో ఆపరేషన్లు నిలిచిపోవడంతో రోగులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని గోఖలే బృందం మళ్లీ జీజీహెచ్‌లో శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు సమాయత్తమైంది.
వాస్తవానికి గత ఏడాది డిసెంబరు నుంచి ఆస్పత్రిలో ఆపరేషన్లు నిర్వహించడానికి గోఖలే బృందం ముందుకువచ్చినా ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందలేదు. ఎట్టకేలకు ఈ నెల 26 నుంచి గుండె ఆపరేషన్లు నిర్వహించడానికి సమాయత్తమయ్యారు. నాలుగేళ్ల తర్వాత శస్త్రచికిత్సలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఆపరేషన్లు నిర్వహించే థియేటర్ల పరిస్థితి, పరికరాలు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకు ముందుగా డాక్టర్ సుధాకర్‌ను జీజీహెచ్‌కు పంపించారు. అయితే వార్డు పరిశీలనకు అనుమతి లేదంటూ ఆస్పత్రి సిబ్బంది ఆయనను లోపలికి అనుమతించలేదు.
- Lack of Facilities in Government Hospitals: పడకేసిన ప్రభుత్వాసుపత్రి.. సౌకర్యాల కొరతతో పేషెంట్ల అవస్థలు..
తాము వైద్య సేవలు అందించడానికి ముందుకు వస్తుంటే వార్డు పరిశీలనకు అనుమతి లేదని వారు చెప్పడంతో గోఖలే బృందం నిరాశ చెందింది. తమ పట్ల ఆసుపత్రి యంత్రాంగం ఇలా వ్యవహరించడమేమిటని వారు నిరాశ చెందారు. ఆసుపత్రిలో సహృద్భావ వాతావరణం లోపించిన నేపథ్యంలో ఆపరేషన్లు నిర్వహించడం సమంజసం కాదని గోఖలే బృందం భావించింది. ఈ నేపథ్యంలోనే గుండె వైద్యనిపుణులు గోపాలకృష్ణ గోఖలే జీజీహెచ్‌లో ఆపరేషన్ల నిర్వహణకు విముఖత వ్యక్తం చేసినట్లు.. తన నిర్ణయాన్ని ఆయన వైద్యారోగ్య శాఖ డైరెక్టర్‌కు, గుంటూరు జిల్లా పరిపాలన అధికారికి లేఖ ద్వారా తెలియజేసినట్లు భావిస్తున్నారు. మరోవైపు నాలుగేళ్లుగా ఆసుపత్రిలో ఆపరేషన్లు నిర్వహించకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటేనే తప్ప పరిస్థితి కుదురుకునే అవకాశం లేదు.
గుండె జబ్బుతో ఆపరేషన్లు లేక అల్లాడుతున్న పేదరోగులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జీజీహెచ్‌లో మళ్లీ గుండె ఆపరేషన్లు పునరుద్ధరించాల్సిన అవసరముందని రోగులు భావిస్తున్నారు.