గుంటూరు జీజీహెచ్‌లో ప్రస్తుతం 60 మంది బ్లాక్ ఫంగస్ చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు ఆస్పత్రిలో పలు కొవిడ్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు కొవిడ్ నుంచి కోలుకుని ఇంటికి వెళ్లిన తర్వాత ఫంగస్‌కు గురై ఆసుపత్రిలో చేరారు. ఇంకొందరు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చి చేరినవారు. వీరందరిని ఒకచోటకు చేర్చి వీరు ఫంగస్‌కు ఎలా గురయ్యారు? కొవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత దానిబారిన పడినవారు ఎంత మంది? స్టెరాయిడ్స్ వంటివి అధికంగా వాడడం వల్ల దానికి గురైనవారు ఎందరు? రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండి దీని బారిన పడినవారు ఎంత మంది అని ఆస్పత్రికి చెందిన చెవి, ముక్కు, గొంతు విభాగం (ఈఎన్‌టీ) వైద్యులు, మరికొందరు ఇతర విభాగాలకు చెందిన వైద్యులు వారికి ప్రాథమిక వైద్య పరీక్షలు జరిపి వివరాలు సేకరించారు. 60 మందిలో 54 మంది మధుమేహం ఉన్నవారు ఫంగస్ బారిన పడ్డారని గుర్తించారు. కొవిడ్ నేపథ్యంలో అధికంగా స్టెరాయిడ్స్ వాడి షుగర్ లెవల్స్ పెరిగిన వారు కొందరైతే మరికొందరికి కొవిడ్‌కు ముందే దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నట్లు వారి పరిశీలనలో తేలింది. మొత్తంగా మధుమేహుల్లోనే ఫంగస్ ఎక్కువగా ఉంటుందనేది జీజీహెచ్ వైద్యుల పరిశీనలోనూ వెల్లడైంది. హెచ్‌ఐవీ తదితర ఇన్‌ఫెక్షన్ వ్యాధులు కలిగిన మరో ఆరుగురిలో ఫంగస్ లక్షణాలు బయటపడ్డాయి. కొవిడ్ వచ్చిపోయిన వారిలోనే కాదు నాన్ కొవిడ్ వారికి ఇది వస్తుందనేది స్పష్టమైంది.
అత్యంత ప్రమాదకరమైన మ్యూకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) వ్యాధి బారిన పడుతున్నవారిలో మధుమేహులే అధికంగా ఉంటున్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల వైద్యుల పరిశీలనలో ఇది వెల్లడైంది. కళ్లు బాగా వాయటం, ఎర్రబడటం, నీళ్లు కారటం, దవడలు నొప్పి, అధికంగా తలపోటు వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఇవి కలిగిన వారు వెంటనే వైద్యులను సంప్రదించి వైద్యసేవలు పొందకపోతే వారం, పది రోజుల్లోనే ఫంగస్ అనేది మెదడుకు చేరి ప్రాణాంతకానికి దారి తీస్తుంది. వారం రోజుల నుంచి బ్లాక్ ఫంగస్ లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో ఆస్పత్రి ఉన్నతాధికారులు అప్రమత్తమై ఈ బాధితుల కోసం ప్రత్యేకంగా రెండు వార్డులు ఏర్పాటు చేశారు. అవి రెండు బాధితులతో నిండిపోయాయి.
గతేడాది కేసుల నమోదు
బ్లాక్ ఫంగస్ అనేది ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చిన వైరస్ కాదు. ఇంతకుముందు కూడా ఇది ఉంది. కరోనా మొదటి దశలోనూ కొందరికి ఈ వ్యాధి లక్షణాలు ఉంటే చికిత్సలు చేశామని జీజీహెచ్ వర్గాలు గుర్తు చేశాయి. కరోనా మొదటి దశలో కన్నా రెండో దశలో దాని తీవ్రత ఎక్కువగా ఉండడం, దాని రూపాన్ని పలు రకాలుగా మార్చుకోవడంతో అది రోగులపై పలు రకాలుగా ప్రభావాన్ని చూపింది. మొదటిదశలో ఒకవార్డులో 30 మంది ఉంటే వారిలో 28 మందికి ఆక్సిజన్ అవసరం లేకుండా చికిత్సలు అందించామని చెబుతున్నారు. అదే సెకండ్ వేవ్‌కు వచ్చేసరికి వార్డులో ఉన్న 30 మందిలో 26-28 మందికి ఆక్సిజన్ అవసరం ఏర్పడిందని విశ్లేషించారు. ఆక్సిజన్ పడకపై ఉన్న రోగులకు అటు ప్రభుత్వ,. ఇటు ప్రైవేటు ఆస్పత్రిలో ఎక్కడైనా సరే వారు ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ఒకే ఆక్సిజన్ మాస్కును వాడడం వంటివి చేస్తున్నారు. ఆక్సిజన్‌లో హ్యుమిడీ ఫైర్ నీళ్లు కలుపుతారు. ఈ నీళ్లను నిత్యం మార్చాలి. ఇది చేయడం లేదు. ఇలా అపరిశుభ్ర వాతావరణం వల్ల కూడా ఫంగల్ డిసీజెస్ అత్యంత వేగంగా సోకుతాయని వైద్యులు వివరించారు.
శస్త్రచికిత్స పరికరాలు ఏవీ...
ఆసుపత్రిలో రోగులను అయితే చేర్చుకుంటున్నారు. ఇది చాలా ఖరీదైన వైద్యం. లక్షణాలు కనిపించిన వారికి వెంటనే వ్యాధి నిర్ధారణ కోసం వేచి చూడకుండా ఇంజక్షన్లు చేయాలి. రోజుకు 50 ఎంజీ ఇంజక్షన్ ఆరు డోసులు అంటే 300 ఎంజీ మందు అవసరమవుతుంది. దీన్ని టీఫైవ్ సొల్యూషన్‌లో కలిపి సిలైన్ ద్వారా రోగి శరీరంలోకి పంపుతారు. ఇలా ఆరు రోజులు ఇవ్వాలి. ఆపై వ్యాధి నిర్ధారణ పరీక్షలకు బయాప్సీ చేస్తారు. స్వాబ్ తీస్తారు. సీటీ, ఎమ్మారై వంటి పరీక్షలు చేస్తారు. వ్యాధి నిర్ధారణ నివేదిక రావడానికి ఐదు రోజులు పడుతుంది. అది వచ్చేవరకు వేచి ఉండకుండా అనుమానిత బాధితులతో ఇంజక్షన్లు వాడాలి. ప్రస్తుతం ఆస్పత్రిలో అత్యవసర కేసులకు మాత్రమే ఇంజక్షన్లు చేస్తున్నారు. దీనికి తొలుత ఇంజక్షన్ చేయాలి. ఆ తర్వాతే ట్యాబ్లెట్లు పెడతామని వైద్యులు చెబుతున్నారు. మెడికల్ మేనేజ్‌మెంట్‌తో పాటు శస్త్రచికిత్సలు చేస్తారు. ఆస్పత్రిలో ఈ పరీక్షలకు, శస్త్రచికిత్సలకు పరికరాల కొరత ఉందని ఇప్పటికే ఈఎన్‌టీ వైద్యులు ఆస్పత్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
శాఖల మధ్య సమన్వయం అవసరం
మ్యుకర్ మైకోసిస్ అనేది కేవలం ఈఎన్‌టీకి సంబంధించిన వైద్యం కానే కాదు. ఈఎన్‌టీ వైద్యులతో పాటు జనరల్ ఫిజీషియన్, ఆప్తమాలజిస్ట్, న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్, డెంటిస్టు, జనరల్ సర్జరీ, ఎనస్తీషియా ఇలా పలు విభాగాల సమన్వయంతోనే ఈ వైద్యసేవలు అందించగలం. షుగర్ పెరిగితే దాన్ని తగ్గించడానికి రోగిని జనరల్ ఫిజీషియన్ చూడాలి. కళ్లకు సమస్య వస్తే ఆప్తమాలజిస్టును పిలిపించాలి. అనేక మంది ఈ వైద్యంలో భాగస్వాములవుతారు. ఆ విధంగానే ఆస్పత్రిలో ముందుకెళ్తున్నారు. మ్యుకర్ మైకోసిస్ అనేది శరీరంలోకి ప్రవేశించి పెరుగుతుంది. దాన్ని గుర్తించి నియంత్రణకు మందులు వాడకపోతే అనతికాలంలోనే పలు అవయవాలను గాయపరుస్తుంది. బయాప్సీ చేసి అంతవరకు తీసేయాలి. లేకపోతే అది శరీరం మొత్తానికి పాకుతుంది. ముక్కు నుంచి కంటికి, అక్కడి నుంచి మెదడుకు ఇది చేరుతుంది. ముందస్తుగా చికిత్స అందజేస్తే ప్రాణాపాయం తప్పుతుంది. ఈ వైరస్ తడి ప్రదేశాల్లో బాగా ఉంటుంది. తడి మాస్క్ ధరించినా ఫంగస్ వస్తుంది. ఇంట్లోనూ గోడలకు చెమ్మ లేకుండా చూసుకోవాలి. బెడ్‌షీట్ క్లాత్‌లు వంటివి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. - డాక్టర్ టి.మధులిక, ఈఎన్‌టీ వైద్యురాలు, జీజీహెచ్
ఇదీ చదవండి: కంకిపాడులో ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్