Cabinet Decisions: ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ.. వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద లక్షా 10 వేల కోట్ల పెట్టుబడితో న్యూఎనర్జీ పార్కు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 10 వేల 500 కోట్ల రూపాయల పెట్టుబడితో "విండ్, సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.
వైజాగ్ టెక్ పార్కుకు 60 ఎకరాల కేటాయింపు సహా వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 9.75 శాతం వడ్డీతో 3వేల 940 కోట్ల రుణం తీసుకోవడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జేయస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థకు రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తులు కేటాయించాలని నిర్ణయించింది.
ఈ సంస్థకు మారిటైమ్ బోర్డు ద్వారా 250 ఎకరాల భూమి కేటాయించాలని తీర్మానించింది. 500 మెగావాట్ల ఆదానీ హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు... విజయనగరం జిల్లా తాడిమర్రి మండలంలో ఎకరాకు 5 లక్షల చొప్పున 406 ఎకరాలు కేటాయించేందుకు సంసిద్ధత తెలిపింది. ప్రభుత్వానికి చిత్తూరు డైరీ చెల్లించాల్సిన 106 కోట్ల రుణమాఫీకి ఆమోదం తెలిపింది.
కర్నూల్లో న్యాయ విశ్వవిద్యాలయ ఏర్పాటుతో పాటు... నిర్మాణానికి 50 ఎకరాల స్థలం ఇచ్చేందుకు పచ్చెజెండా ఊపింది. 65 వేల 537 మంది జూనియర్ న్యాయవాదులకు "లా నేస్తం" ద్వారా 5 వేల ఆర్థిక సహకారం అందించాలని తీర్మానించింది. వైద్యారోగ్య శాఖలో నియామకాల కోసం "ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్టు" ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటు, వైద్య సేవలు అందించాలని నిశ్చయించింది.
పాఠశాలల్లో మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ విధానం అమలు, డిజిటల్ క్లాస్‌రూముల కోసం 30 వేల 213 డిజిటల్ ప్యానల్ బోర్డులు ఏర్పాటుచేస్తామని కేబినెట్ తెలిపింది. చిన్నస్థాయి గ్రానైట్ పరిశ్రమలకు యూనిట్ విద్యుత్ 2 రూపాయిలకే అందించించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10 నుంచి కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు ప్రారంభించి, లబ్ధిదారులకు లక్ష రూపాయలు అందించాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. సత్యసాయి ట్రస్టు సహకారంతో 86 కోట్లతో మార్చి 2 నుంచి విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేయాలని నిర్ణయించింది. డ్వాక్రా మహిళలకు ఆసరా పథకం ద్వారా 6 వేల 500 కోట్ల రూపాయల పంపిణీ, ఈబీసీ నేస్తం ద్వారా 600 కోట్లు పంపిణీకి ఆమోద ముద్ర వేసింది.
ఇవీ చదవండి: